Volkswagen Tiguan Facelift | జర్మనీ కార్ల తయారీ సంస్థ ఫోక్స్ వ్యాగన్ దేశీయ విపణిలోకి అప్డేటెడ్ టిగువాన్ ఫేస్‌లిఫ్ట్ కారును ఆవిష్కరించింది. దీన్ని దేశీయంగా పూర్తిగా అసెంబ్లింగ్ చేశారు. దీని ధర రూ.31.99 లక్షలుగా నిర్ణయించింది. విపణిలో కేవలం పెట్రోల్ వేరియంట్ కారు మాత్రమే అందుబాటులో ఉంటుంది. గతేడాది తొలిసారి మార్కెట్లోకి వచ్చిన టిగువాన్ ఫేస్‌లిఫ్ట్-2021 పలు మార్పులతో కస్టమర్ల ముందుకొచ్చింది. ఈ కారు జీప్ కంపాస్, హ్యుండాయ్ టక్సాన్, సిట్రాన్ సీ5 ఎయిర్ క్రాస్ మోడల్ కార్లతో పోటీ పడనుంది.
తాజా వర్షన్ టిగువాన్ ఫేస్‌లిఫ్ట్‌లో స్వల్పంగా వంచిన రేడియేటర్ గ్రిల్ ఏర్పాటు చేశారు. చివరిలో సన్నగా మారిన ఈ గ్రిల్‌లోనే ఎల్ఈడీ మ్యాట్రిక్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్ ఏర్పాటు చేశారు. 2.0 లీటర్ల 4-సిలిండర్ టర్బో చార్జ్డ్ ఇంజిన్ గల ఈ కారు 320 ఎన్ఎం టార్చ్ వద్ద 18 బీహెచ్పీ పవర్ విడుదల చేస్తుంది. ముందు వరుసలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా 30 షేడ్స్ యాంబియెంట్ లైటింగ్, పనారోమిక్ రూఫ్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, మల్టీ ఫంక్షన్ ఫ్లాట్ బాటం స్టీరింగ్ వీల్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఏర్పాటు చేశారు.