న్యూఢిల్లీ, మే 30: టెలికం సేవల సంస్థ వొడాఫోన్ ఐడియా.. వీడియో స్ట్రీమింగ్ సేవల సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో జట్టుకట్టింది. తన కస్టమర్లకు ఎంటర్టైన్మెంట్ సేవల పరిధిని మరింత విస్తరించడంలో భాగంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం రెండు సరికొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్లను సైతం ఆవిష్కరించబోతున్నది. యూజర్లు తమకు నచ్చిన మొబైల్, టెలివిజన్ లేదా ట్యాబ్లెట్లో ఈ సరికొత్త స్ట్రీమింగ్ సదుపాయం పొందవచ్చునని తెలిపింది. ఇందుకోసం వొడాఫోన్ ఐడియా రెం డు ప్రీపెయిడ్ ప్లాన్లను ఆవిష్కరించింది.
ఈ ప్లాన్లలో అన్లిమిటెడ్ కాల్స్, డాటా పొందవచ్చునని తెలిపింది. దీంట్లో 70 రోజుల కాలపరిమితి కలిగిన రూ.999 ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డాటాతోపాటు 100 ఎస్ఎంఎస్/రోజుకు, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చును. అలాగే 84 రోజుల కాలపరిమితితో విడుదల చేసిన ప్లాన్‌లో రోజుకు 2.5 జీబీ డాటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ వాయిస్, నెట్‌ఫ్లిక్స్ బేసిస్(టీవీ లేదా మొబైల్) పొందవచ్చును. ఈ ప్లాన్ చార్జీ రూ.1,399గా నిర్ణయించింది.