V-Gaurd : ఎలక్ట్రిక్ కంపెనీ వీ-గార్డ్ గృహోపకరణాల తయారీలోకి అడుగుపెట్టనుంది. అందులో భాగంగా గృహోపకరణాల తయారీ సంస్థ సన్ఫ్లేమ్ను కొనుగోలు చేయనుంది. సన్ఫ్లేమ్ ఎంటర్ప్రైజెస్ను కొనుగోలు చేస్తున్నట్టు వీ-గార్డ్ శుక్రవారం వెల్లడించింది. ఇరుసంస్థలు కొనుగోలు ఒప్పందం మీద సంతకాలు చేశాయి. రూ.660 కోట్లకు డీల్ కుదిరింది. అంతేకాదు నగదు రహిత లావాదేవీల ద్వారా ఆ కంపెనీలో 100 శాతం వాటాను కూడా వీ-గార్డ్ సొంతం చేసుకోనుంది. కొనుగోలు ప్రక్రియను వచ్చే ఏడాది జనవరి రెండో వారం కల్లా పూర్తి చేస్తామని ఆ సంస్థ వెల్లడించింది. సన్ఫ్లేమ్ను హస్తగతం చేసుకోనున్నట్టు ప్రకటించగానే వీ-గార్డ్ షేర్లు 4 శాతం పెరిగాయి.
మనదేశంలో వంట పాత్రలు, గృహోపకరణాల తయారీ సంస్థల్లో సన్ఫ్లేమ్ చాలా పాపులర్. ఈ సంస్థను సొంతం చేసుకోవడంతో కిచెన్వేర్లో వీ-గార్డ్ అగ్రగామిగా నిలవాలనుకుంటోంది. వీ-గార్డ్ వినియోగదారులకు ఈ ఒప్పందం చాలా ఉపయోగకరం కానుంది. ఇకనుంచి వీ-గార్డ్ వాళ్ల అవసరానికి తగ్గ వస్తువులను అందించడంలో ముదుంటుంది అని వీ-గార్డ్ మేనేజింగ్ డైరెక్టర్ మిథున్ చిట్టిలప్పిల్లి తెలిపారు. వీ-గార్డ్తో కలవడం వల్ల సన్ఫ్లేమ్ బ్రాండ్ మరింత ఉన్నత స్థాయికి చేరుతుందనే నమ్మకం తనకు ఉందని ఆ సంస్థ ఎండీ కేఎల్ వర్మ వెల్లడించారు.