న్యూఢిల్లీ, మార్చి 30: ప్రముఖ కన్జ్యూమర్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ వీ-గార్డ్ ఇండస్ట్రీస్.. హైదరాబాద్‌లో నూతన ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నది. విస్తరణ దిశగా వెళ్తున్న ఈ సంస్థ.. దేశవ్యాప్తంగా హైదరాబాద్‌సహా మరికొన్ని చోట్ల కొత్త ఉత్పాదక కేంద్రాలను పెడుతున్నది. ఈ క్రమంలోనే ఐదేండ్లలో రూ.400 కోట్లకుపైగా పెట్టుబడులను పెట్టాలని నిర్ణయించింది. 2024 వరకు కొత్త ప్లాంట్లలో ఉత్పత్తి మొదలు కావాలన్న లక్ష్యంతో ముందుకు సాగతున్న వీ-గార్డ్.. ఇప్పటికే దాదాపు రూ.200 కోట్ల పెట్టుబడులను పెట్టింది. మరో రూ.200 కోట్లకుపైగా పెట్టుబడులను పెట్టనున్నది. మార్కెట్లోకి కొత్తగా ‘రొమాంజా ఆర్ట్’ పేరుతో ప్రీమియం డెకరేటివ్ డస్ట్ రీపెల్లెంట్ ఆర్ట్ ఫ్యాన్‌ను బుధవారం సంస్థ విడుదల చేసింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌తోపాటు ఉత్తరాఖండ్, సిక్కిం, గుజరాత్‌లలో మొత్తం నాలుగు ప్లాంట్లను తీసుకువస్తున్నట్టు కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రామచంద్రన్ వెంకటరామన్ తెలిపారు.
దేశంలోని ఉత్తర, తూర్పు, పశ్చిమాది రాష్ర్టాల్లో 60 శాతానికిపైగా రెవిన్యూను లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఈ సందర్భంగా వీ-గార్డ్ తెలిపింది. ఈ క్రమంలోనే ఆయా ప్రాంతాల్లో విస్తరణపై దృష్టి పెట్టామని చెప్తున్నది. సంస్థ వ్యాపారంలో ప్రస్తుతం ఈ రాష్ర్టాల వాటా సుమారు 42 శాతంగా ఉన్నది. 2020-21లో వీ-గార్డ్ ఇండస్ట్రీస్ రెవిన్యూ రూ.2,699 కోట్లుగా ఉన్నది. కరోనా ప్రభావం నుంచి మార్కెట్ ఇప్పుడిప్పుడే బయటపడుతున్నదన్న వెంకటరామన్.. ఈ ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఏప్రిల్-డిసెంబర్ మధ్య దాదాపు 30-31 శాతం వృద్ధిని చూశామన్నారు. కంపెనీ స్థాయిలో ఏటా 5,000-7,000 భాగస్వాముల్ని అందిపుచ్చుకుంటున్నట్టు చెప్పారు.
వంటింటి ఉత్పత్తులతోపాటు ఫ్యాన్లు, వాటర్ హీటర్లు, కూలర్లు తదితర కన్జ్యూమర్ డ్యూరబుల్ ఉత్పత్తుల తయారీ, అమ్మకాలపైనా దృష్టి పెట్టినట్టు వెంకటరామన్ తెలియజేశారు. ఈ క్రమంలోనే ముఖ్యంగా స్విచెస్, స్విచ్‌గేర్ వంటి ఎలక్ట్రికల్స్ ఉత్పత్తుల విభాగంలో బలోపేతమవుతున్నట్టు చెప్పారు. కేరళకు చెందిన వీ-గార్డ్.. తొలుత వోల్టేజ్ స్టెబిలైజర్లతో మార్కెట్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈవీల్లో ప్రత్యామ్నాయ బ్యాటరీ టెక్నాలజీపై పనిచేస్తున్న గెగడైన్ ఎనర్జీలో 18.77 శాతం వాటాను పొందిన వీ-గార్డ్.. ఇటీవల సైమన్ ఎలక్ట్రిక్ సంస్థ విలీనాన్ని ప్రకటించింది.