UPI Payments : చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లు యూపీఐ లావాదేవీలపై త్వరలోనే ఛార్జీలు అమలు కాబోతున్నాయి. అవి మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)కు సంబంధించిన ఛార్జీలు. ఈ విధానం రెండు వారాల్లోగా అమలులోకి వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి వారంలోపే అధికారిక నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని ఆర్థిక వ్యవహారాల శాఖ వర్గాలు తెలిపాయి. అయితే, ఈ విషయంలో యూపీఐ వినియోగదారులు కంగారు పడాల్సిన అవసరం లేదు.
ఈ విధానం అమలైతే వారిపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఇది ఎండీఆర్. అంటే, వ్యాపారస్తులపై మాత్రమే ఛార్జీలు విధిస్తారు. రూ.2,000 లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన లావాదేవీలపై మాత్రమే విధించే ఛార్జి ఇది. అది కూడా 0.3 శాతం. డిజిటల్ పేమెంట్ స్వీకరించే వ్యాపారులే దీన్ని చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఇతర ఎలక్ట్రానిక్ పేమెంట్లపై ఎలాంటి ఛార్జీ ఉండదు. ఎండీఆర్ అంటే ప్రతి లావాదేవీపై వ్యాపారులు బ్యాంకులకు లేదా సర్వీస్ ప్రొవైడర్లకు చెల్లించే ఫీజు. ఈ విధానం గతంలో అమలులో ఉండేది.
కానీ, యూపీఐ, డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్రం 2020లో ఎండీఆర్‌ను రద్దు చేసింది. మరో వారంలో దీనిపై గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత యూపీఐ అండ్ సర్వీస్ స్టీరింగ్ కమిటీ అయిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తగిన విధి విధానాలు ఖరారు చేస్తుంది. ఎండీఆర్ అమలును వ్యాపారస్తులు వ్యతిరేకిస్తుంటే, బ్యాంకర్లు సమర్ధిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో మొత్తం డిజిటల్ లావాదేవీలలో 85 శాతం ట్రాన్సాక్షన్స్ యూపీఐ ద్వారానే జరిగాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.314.23 లక్షల కోట్ల విలువైన 241.62 బిలియన్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి.
ఇలా భారీ స్థాయిలో జరిగే చెల్లింపుల కోసం సర్వర్లు, నెట్వర్క్ సెక్యూరిటీ వంటి అంశాల నిర్వహణ బ్యాంకులకు తలకుమించిన భారంగా మారింది. వాటికి ఆర్థిక భారం అవుతోంది. అందుకే, ఈ భారం తగ్గాలంటే ఎండీఆర్ అమలు చేయాలని బ్యాంకులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి.