E-Bike | బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఈవీ స్టార్టప్ కంపెనీ అల్ట్రా వయ్లెట్.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఈవీ బైక్ `ఎఫ్77` తెచ్చింది. గంటకు 152 కి.మీ వేగంతో దూసుకెళ్లగల ఈ బైక్.. సింగిల్ చార్జింగ్‌తో 307 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. మూడు వేరియంట్లతో వినియోగదారుల ముంగిట్లోకి వచ్చింది. స్టాండర్డ్, రెకాన్ వేరియంట్‌తోపాటు లిమిటెడ్ ఎడిషన్ అనే పేరతో మూడో వేరియంట్ బైక్ ఆవిష్కరించింది. కస్టమర్లు రూ.10 వేలు చెల్లించి శుక్రవారం నుంచి ఆల్ట్రా వయ్లెట్ బైక్ బుక్ చేసుకోవచ్చు.
ఎఫ్ 77 స్టాండర్డ్ వేరియంట్ బైక్ ధర రూ.3.8 లక్షలుగా, ఎఫ్ 77 రెకాన్ వేరియంట్ రూ.4.5 లక్షలుగా, ఎఫ్77 స్పెషల్ పేరిట లిమిటెడ్ ఎడిషన్ మోటారు సైకిల్ ధర రూ.5.5 లక్షలుగా ఖరారు చేసింది. లిమిటెడ్ ఆఫర్లో కేవలం 77 బైక్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. లిమిటెడ్ వర్షన్ బైక్ గరిష్టంగా 152 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది. మూడు వేరియంట్ బైక్‌లు కూడా గరిష్టంగా గంటకు 147 కి.మీ. దూరం ప్రయాణిస్తాయి. గ్లైడ్, కంబాట్, బ్లాస్టిక్ మోడ్లలో ఇవి అందుబాటులో ఉంటాయి.
స్టాండర్డ్ అండ్ రెకాన్ వేరియంట్ బైక్‌లు 38.8 బీహెచ్పీ పవర్, 95 ఎన్ఎం టారచి వెలువరిస్తాయి. స్టాండర్డ్ బైక్ 7.1 కిలోవాట్ల సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌తోపాటు 206 కి.మీ దూరం, రెకాన్ వేరియంట్ 10.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో 307 కి.మీ. దూరం ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. వీటిల్లో ఎల్ఈడీ లైట్స్, టీఎఫ్టీ డిస్ప్లే, కనెక్టివిటీ ఫీచర్లు, ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్‌లు, అల్లాయ్ వీల్స్, డ్యుయల్ చానెల్ ఏబీఎస్ ఫీచర్ జత చేశారు. 2023 జనవరిలో బెంగళూర్.. తర్వాత ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్ తదితర నగరాల్లో డెలివరీ చేస్తామని కంపెనీ వెల్లడించింది.
స్టాండర్డ్ వేరియంట్ ఎఫ్77 బైక్ గంట చార్జింగ్ చేస్తే 35 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయొచ్చు. బూస్ట్ చార్జర్‌తో గంట సేపు చార్జింగ్ చేస్తే 75 కి.మీ దూరం ప్రయాణం చేయవచ్చు. స్టాండర్డ్ వేరియంట్ ఎఫ్77 బైక్ మూడేండ్లు లేదా 30 వేల కి.మీ దూరం వారంటీ, రెకాన్ వేరియంట్ ఐదేండ్లు లేదా 50 వేల కి.మీ. దూరం, లిమిటెడ్ వేరియంట్ 8 ఏండ్లు లేదా లక్ష కి.మీ. దూరం వారంటీ ఆఫర్ చేస్తున్నది.