న్యూఢిల్లీ నుంచి నమస్తే తెలంగాణ ప్రతినిధి: జర్మనీకి చెందిన లగ్జరీ బైకుల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్..దేశీయ మార్కెట్లోకి జీ 310 ఆర్ఆర్ బైకును పరిచయం చేసింది. ఈ బైకు ప్రారంభ ధర రూ.2.85 లక్షలు(ఢిల్లీ షోరూంలో)గా నిర్ణయించింది. వీటిలో జీ 310 ఆర్ఆర్ మోడల్ ధర రూ.2.85 లక్షలుగాను, జీ 310 ఆర్ఆర్ ైస్టెల్ మోడల్ రూ.2.99 లక్షలకు విక్రయించనున్నది. గడిచిన ఐదేండ్లలోనే జీ 310 ఆర్, జీ 310 జీఎస్ మోడళ్ళకు అంతర్జాతీయ మార్కెట్లో అత్యధిక డిమాండ్ నెలకొన్నదని, దీంట్లోభాగంగానే జీ 310లోనే మూడో మోడల్ ఇదని బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఆసియా రీజినల్ హెడ్ మార్కస్ ముల్లర్-జాంబ్రి తెలిపారు. లగ్జరీ బైకులు అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న భారత్లోనే ఈ బైకును విడుదల చేసినట్లు, తర్వాత మిగతా దేశాలకు విస్తరించనున్నట్లు ఆయన ప్రకటించారు. 313 సీసీ ఇంజిన్ కలిగిన ఈ జీ 310 ఆర్ఆర్ మోడల్ కేవలం 2.9 సెకండ్లలోనే 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది. ఈ సరికొత్త బైకును బీఎండబ్ల్యూ మోటోరాడ్, టీవీఎస్ మోటర్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.