Mobile Number Portability | మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ నెట్వర్క్ సరిగ్గా పని చేయకపోవడం, ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మొబైల్ ఫోన్ యూజర్లు తమ సిమ్ కార్డులు మార్చేస్తుంటారు. సంబంధిత మొబైల్ నంబర్ మారకుండానే ఇప్పటి వరకూ వేరే నెట్‌వర్క్‌కు మారేందుకు ట్రాయ్.. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఏమాత్రం అవకాశం ఉన్నా ఆన్ లైన్ లో సిమ్ కార్డుల స్వాపింగ్ వంటి మోసాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి ఎవరైనా సిమ్ కార్డు యూజర్.. మరో నెట్వర్క్కి స్వాప్ చేసినా, రీప్లేస్ చేసుకున్న ఏడు రోజుల వరకూ మరో నెట్ వర్క్‌కు మారకుండా నిలిపివేస్తూ ట్రాయ్ నిర్ణయం తీసుకున్నది. వచ్చే జూలై ఒకటో తేదీ నుంచి ట్రాయ్ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.
సిమ్ పేరుతో జరుగుతున్న మోసాలను నియంత్రించాలని పేర్కొంటూ టెలికం శాఖ లేఖ రాయడంతో ట్రాయ్ కొత్త నిబంధన తీసుకొచ్చింది. దీని ప్రకారం వచ్చే జూలై ఒకటో తేదీ నుంచి సిమ్ కార్డు మార్చుకున్నా, స్వాప్ చేసినా వారం వరకూ వేరే నెట్‌వర్క్‌కు మారడానికి అవసరమైన యూనిక్ పోర్టింగ్ కోడ్ (యూపీసీ) జారీ చేయదు. ఆన్ లైన్ మోసగాళ్లు కొత్త వ్యక్తి పేరుతో అదే నంబర్ తీసుకోకుండా నివారించడానికే ఈ నిబంధన తెచ్చామని ట్రాయ్ వివరించింది.
సిమ్ కార్డు పాడైనా, పోయినా సంబంధిత టెలికం సంస్థను సంప్రదిస్తే కొత్త సిమ్ కార్డ్ జారీ చేస్తుంటాయి. వేరే నెట్‌వర్క్‌కు మారాలంటే ప్రస్తుతం వాడుతున్న మొబైల్ నంబర్ నుంచి పీఓఆర్ టీ< మొబైల్ నంబర్> టైప్ చేసి 1900 నంబర్ కు మెసేజ్ పంపితే యూనిక్ కోడ్ వస్తుంది. ఇతర మొబైల్ నెట్ వర్క్ కు మారినప్పడు ఈ నంబర్ ఇవ్వాలి. 2009లో తొలిసారి ట్రాయ్.. మొబైల్ నంబర్ పోర్టబిలిటీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.