న్యూఢిల్లీ, ఆగస్టు 24: తిరుపతి విమానాశ్రయం ప్రైవేట్‌పరం కాబోతున్నది. వారణాసి సహా దేశంలోని మరో 10 ఎయిర్‌పోర్టులనూ కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల చేతికి అప్పగించాలని యోచిస్తున్నది. ప్రభుత్వ-ప్రైవేట్-భాగస్వామ్యం (పీపీపీ) విధానం కింద 5 గ్రూపులుగా విభజించి మొత్తం 11 విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలని మోదీ సర్కార్ చూస్తున్నది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రతిపాదించగా.. ఈ నెల 4న ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అనురాధా ఠాకూర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పీపీపీ అప్రైజల్ కమిటీ ఇందుకు సూత్రప్రాయ ఆమోదం కూడా తెలిపిందని ఓ అధికారిక డాక్యుమెంట్ ప్రకారం తెలుస్తున్నది.
5 పెద్ద ఎయిర్‌పోర్టులు, 6 చిన్న ఎయిర్‌పోర్టులను ప్రైవేటీకరించాలని ప్రయత్నిస్తున్నారు. వీటిలో తిరుపతి, తిరుచిరాపల్లి ఎయిర్‌పోర్టులు ఒక గ్రూపుగా ఉండగా.. అమృత్సర్, కంగ్రా-గగ్గల్ ఎయిర్‌పోర్టులు మరొక గ్రూపుగా ఉన్నాయి. అలాగే వారణాసి, గయా, ఖుషీనగర్ విమానాశ్రయాలను ఇంకో గ్రూపులో పెట్టారు. ఇక భువనేశ్వర్-హుబ్బళ్లి, రాయ్‌పూర్-ఔరంగాబాద్ ఎయిర్‌పోర్టులు మిగతా రెండు గ్రూపులు. ఒక్కో గ్రూపును ఒక్కో బిడ్డర్‌కు అప్పగించే అవకాశాలున్నాయని సమాచారం. 50 ఏండ్ల రాయితీ కాలవ్యవధితో లీజుకు ఇవ్వనున్నారని డాక్యుమెంట్ ప్రకారం తెలుస్తున్నది.
ఈ ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణకు రాయితీదారులు మొత్తం రూ.8,622 కోట్ల పెట్టుబడులు పెట్టవచ్చని అంచనా. ఇక ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైతే ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టుల్లో పనిచేస్తున్న ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఉద్యోగుల నిర్వహణ బాధ్యతను తొలి ఏడాది ప్రభుత్వం, బిడ్ గెల్చుకున్న ప్రైవేట్ సంస్థలు సంయుక్తంగా చూసుకుంటాయి. ఆ తర్వాత ఉద్యోగుల్ని ఉంచాలా? తీసేయాలా? అన్నది ప్రైవేట్ సంస్థల ఇష్టానుసారమే. అయితే మూడేండ్లపాటు ఉద్యోగుల్లో 60 శాతం మందిని తప్పక పనిలో పెట్టుకోవాలన్న నిబంధన ఉన్నట్టు సమాచారం.
హైదరాబాద్, న్యూఢిల్లీ ఎయిర్‌పోర్టులను రూ.19,400 కోట్ల (2 బిలియన్ డాలర్లు) వ్యయంతో జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ విస్తరించాలని భావిస్తున్నది. వచ్చే పదేండ్లలో భారతీయ విమానయాన రంగం మరింత రద్దీగా మారబోతున్నదన్న అంచనాల నడుమ ఇది ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది. కాగా, వచ్చే 5-7 ఏండ్లలో ఈ విస్తరణ పనులు పూర్తయ్యే వీలున్నదని, విమానాశ్రయాల సామర్థ్యం పెంపు, ఆధునికీకరణ, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టామని కంపెనీ ఆర్థిక, వ్యూహ రచన విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సౌరభ చావ్లా చెప్తున్నారు.
కాగా, హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణకు రూ.13,800 కోట్లు ఖర్చు పెట్టనున్న జీఎమ్మార్.. న్యూఢిల్లీలోని విమానాశ్రయం విస్తరణకు రూ.5,600 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నది. ఇక విస్తరణ పనులు పూర్తయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ప్రయాణికుల వార్షిక సామర్థ్యం దాదాపు 8 కోట్లకు చేరగలదని అంచనా. ప్రస్తుతం 3.4 కోట్లుగానే ఉన్నది. రాబోయే 14 ఏండ్లలో భారతీయ విమాన ప్రయాణికుల రద్దీ 110 కోట్లకు చేరుతుందని అంచనా. ఇప్పుడున్న దానితో పోల్చితే ఇది 6 రెట్లు ఎక్కువ. దేశీయ విమానాశ్రయ నిర్వహణ రంగంలో అదానీ, జీఎమ్మార్ గ్రూపుల మధ్య గట్టి పోటీ నెలకొన్న విషయం తెలిసిందే.