ముంబై, జనవరి 8: ఐఫోన్ తయారీ దిగ్గజం యాపిల్ అధిపతి టిమ్ కుక్ జీతం 2021లో భారీగా పెరిగింది. 2020లో 14.8 మిలియన్ డాలర్లున్న (రూ.110 కోట్లు) కుక్ వార్షిక వేతనం 2021లో ఏకంగా 98.7 మిలియన్ డాలర్లకు (రూ.750 కోట్లు) పెరిగింది. గతేడాది యాపిల్ సగటు ఉద్యోగి జీతం 68,254 డాలర్ల (రూ.51.5 లక్షలు) కంటే కుక్ వేతనం 1447 రెట్లు ఎక్కువ. అయితే 2020లో ఈ వ్యత్యాసం తక్కువగా ఉంది. ఆ ఏడాది సగటు యాపిల్ ఉద్యోగి శాలరీ 57,783 డాలర్లకంటే కుక్ వేతనం 256 రెట్లు అధికం. 2021లో ఉద్యోగి జీతం 20 శాతం వరకూ పెరిగినప్పటికీ, కుక్ వేతనం 600 శాతం ఎగిసింది. వాస్తవానికి కుక్ 2021లో జీతంగా నగదు రూపంలో అందుకున్నది 3 మిలియన్ డాలర్లే. 82.3 బిలియన్ డాలర్ల విలువైన యాపిల్ స్టాక్ ఆప్షన్లను కంపెనీ చెల్లించింది. యాపిల్ అమ్మకాల లక్ష్యాల్ని సాధించినందుకు 12 మిలియన్ డాలర్లు అదనంగా పొందారు. విమాన ప్రయాణాల కోసం కుక్కు కంపెనీ 1.4 మిలియన్ డాలర్లు చెల్లించింది. ఈ కొత్త సంవత్సరంలో యాపిల్..ప్రపంచంలో 3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువగల తొలి కంపెనీగా ఘనత సాధించిన సంగతి తెలిసిందే.