Kia Sonet | దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా ఇండియా (Kia India).. కీలక మైలురాయిని చేరుకున్నది. 2020 సెప్టెంబర్‌లో తన పాపులర్ కంపాక్ట్ ఎస్యూవీ కియా సోనెట్ (Kia Sonet)ను ఆవిష్కరించింది. నాటి నుంచి కేవలం 44 నెలల్లో నాలుగు లక్షల కార్లను విక్రయించింది. దేశీయ మార్కెట్లో 3,17,754 యూనిట్లు విక్రయించగా, విదేశాలకు 85,814 కార్లు ఎగుమతి చేసింది. కియా సోనెట్ కార్ల కొనుగోలు దారుల్లో 63 శాతం మంది సన్ రూఫ్ కు ప్రాధాన్యం ఇచ్చారు. 37 శాతం మంది కస్టమర్లు 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్, 63 శాతం మంది పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ ఎంచుకున్నారు.
కార్ల కొనుగోలు దారుల్లో మెజారిటీ ఆటోమేటిక్ వేరియంట్ల వైపు మళ్లుతున్నారని కియా ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. 2020 నుంచి 7-స్పీడ్ డీసీటీ మోడల్ కారును 37.50 శాతం మంది కస్టమర్లు ఎంచుకుంటే 7-స్పీడ్ డీసీటీ, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లు గల కార్లను 28 శాతం, ఐఎంటీ వేరియంట్‌కు 23 శాతం మంది ప్రాధాన్యం ఇచ్చారు.
సోనెట్ కంపాక్ట్ ఎస్యూవీ కారులో డీజిల్, పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో నాలుగు న్యూ హెచ్‌టీఈ (ఓ), హెచ్టీకే (ఓ) మోడల్ కార్లను మార్కెట్లో విడుదల చేయడం ద్వారా కియా తన ఎంట్రీ, మిడ్ లెవల్ వేరియంట్లను బలోపేతం చేసింది. హెచ్‌టీఈ (ఓ) వేరియంట్ సన్‌రూఫ్, హెచ్టీకే (ఓ) వేరియంట్ ఎల్ఈడీ కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్‌తోపాటు సన్ రూఫ్, ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, రేర్ డీఫాగర్ ఫీచర్లు ఉంటాయి.
కియా సోనెట్ ప్రతి నెలా సగటున 9,000లకు పైగా కార్లు అమ్ముడయ్యాయి. సేఫ్టీ కోసం అడాస్ వంటి అదనపు ఫీచర్లతో కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వర్షన్ మోడల్‌ను ఆవిష్కరించింది. కియా సోనెట్ కారు ధర రూ.7.99 లక్షల నుంచి రూ.15.75 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలుకుతుంది. టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజా, హ్యుండాయ్ వెన్యూ వంటి కార్లతో కియా సోనెట్ పోటీ పడుతుంది.