ఆరోగ్య బీమాను కొనేటప్పుడు మన శ్రేయస్సు, ఆర్థిక స్థితిగతులు, అవసరాలను తప్పక దృష్టిలో పెట్టుకోవాలి. వీటన్నిటికీ భద్రత లభించేలా ఓ చక్కని నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే బీమా ధీమా దొరుకుతుంది. అయితే చాలామంది అవగాహన లేమితో ఆరోగ్య బీమాలను కొంటున్నారు. తద్వారా పాలసీ ప్రయోజనాలకు దూరమైపోతున్నారు. కానీ అత్యవసర సమయాల్లోనే ఆ విషయాన్ని గ్రహిస్తున్నారు. క్లెయిముల తిరస్కరణ, తక్కువ కవరేజీల వంటివి.. ఎక్కువమంది ఎదుర్కొంటున్న సమస్యలు. అందుకే మీ వైద్య ఖర్చులను అధిగమించడానికి సరైన పాలసీనే అన్నివిధాలా ఎంచుకోవాలి. అప్పుడే మీతోపాటు మీపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు శ్రీరామ రక్ష. మరి నిపుణులు ఏం సూచనలు చేస్తున్నారంటే..
Health Insurance | ప్రస్తుతం దేశంలో వైద్య ఖర్చులు బాగా పెరిగిపోయాయి. అందుకే సరైన పాలసీ అనేది ఆప్షన్ కాదు.. అవసరం. తగిన పాలసీతో దవాఖాన ఖర్చులన్నింటి నుంచి బయటపడవచ్చు. కాబట్టి మీరు కొనే ఆరోగ్య బీమా కవరేజీ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. అందుకు మీ ఆరోగ్య అవసరాలను మదించండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, వారి వయసు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఓ నిర్ణయం తీసుకుంటే తగు పాలసీ లభిస్తుంది.
ఆరోగ్య బీమా పాలసీదారులు వెయిటింగ్ పీరియడ్‌ను తక్కువగా అంచనా వేస్తారు. ప్రస్తుత ఆరోగ్య సమస్యలు, మెటర్నిటీ ప్రయోజనాలకుండే వెయిటింగ్ పీరియడ్ ఎంత? అన్నది చూసుకోవాలి. సాధారణంగా 2 నుంచి 4 ఏండ్లు ఆగితేగానీ కొన్ని ప్రయోజనాలు అందవు. కాబట్టి ఆరోగ్య బీమా కొనేటప్పుడు సదరు పాలసీలో అన్ని ఆరోగ్య సమస్యలకు కావాల్సిన చికిత్సలు పొందేలా కవరేజీ ఉందా? లేదా? ఎన్నేండ్లు ఆగితే కవరేజీ వస్తుంది? అన్నది తెలుసుకోవాలి.
తక్కువ ప్రీమియం అనగానే త్వరపడి ఆరోగ్య బీమాలను తీసుకోవద్దు. ప్రీమియం తక్కువగా ఉంటే బీమా ప్రయోజనాలు, కవరేజీ కూడా తక్కువగానే ఉంటాయి. అలాగని ఎక్కువ ప్రీమియం చెల్లిస్తేనే సమగ్ర కవరేజీ వస్తుందని భావిస్తే.. మోసపోయే వీలున్నది. అందుకే మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని ఆరోగ్య బీమా పాలసీల ధరలు, వాటి ద్వారా అందే ప్రయోజనాలను ఒక్కసారి సమీక్షించండి. అప్పుడు సరైన పాలసీని అందుబాటు ధరలకే కొనవచ్చు.
మనకు ఆరోగ్య బీమాను అందించే సంస్థ.. అన్ని దవాఖానలతో టైఅప్ అయ్యిందా? క్యాష్‌లెస్ సదుపాయాలున్న హాస్పిటల్స్ల్లోకి వెళ్లవచ్చా? అన్నదీ తెలుసుకోవాలి. నెట్వర్క్ హాస్పిటల్స్, క్యాష్‌లెస్ ఫెసిలిటీస్‌ను మరిస్తే తిప్పలు తప్పవు. ముఖ్యంగా మీకు దగ్గర్లోని ఆస్పత్రులు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ల్లో మీ పాలసీపై చికిత్సను తీసుకోవచ్చా? అన్నది చూసుకోవాలి. ఆరోగ్యం విషమిస్తే ఎంత తక్కువ సమయంలో వైద్యం అందితే అంత మంచిది మరి. కాబట్టి దగ్గర్లోని దవాఖానలకు వెంటనే వెళ్లిపోయేలా పాలసీలుండాలి. ఉచిత అంబూలెన్స్ సదుపాయం, డిశ్చార్జి తర్వాత వాడే మందుల ఖర్చు, రకరకాల వైద్య పరీక్షల ఖర్చుల్నీ పొందగలగాలి.
ఆరోగ్య బీమా పాలసీని కొనేటప్పుడు అబద్ధాలు చెప్పకూడదు. మీ, మీవాళ్ల ఆరోగ్య పరిస్థితి గురించి నిజాలు చెప్పకపోతే నష్టం మీకే. క్లెయిములు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉన్నది. అప్పుడు దవాఖాన ఖర్చులను మీరే భరించాల్సి ఉంటుంది. కనుక మీకున్న ప్రతీ చిన్న ఆరోగ్య సమస్యనూ పాలసీ డాక్యుమెంట్లలో పేర్కొనడం ఉత్తమం.