న్యూఢిల్లీ, అక్టోబర్ 7: అవసరం కొరకో.. ప్రయోజనం కోసమో.. మనలో చాలామంది ఒకే బ్యాంక్లో లేదా వేర్వేరు బ్యాంకుల్లో ఒకటికి మించి పొదుపు ఖాతాల్ని తెరుస్తున్నవారే. ఈ క్రమంలో పనైపోయాక సదరు ఖాతాల్లో నుంచి కనీస నగదు నిల్వల్ని తీసుకుని అలాగే వదిలేస్తున్నవారెందరో. అయితే దీనివల్ల ఆర్థిక మోసాల బారినపడే ప్రమాదమున్నది. ఇక ఖాతాల్లో సరిపడా నగదు నిల్వలు లేక జరిమానాలను ఎదుర్కొంటున్నవారూ ఉన్నారు. దీంతో అనవసరపు సేవింగ్స్ అకౌంట్లను మూసేందుకు నిర్ణయించుకోవడం సహజమే. అయితే అప్పుడు ఈ అంశాలను గుర్తుంచుకోండి.
ఏదైతే సేవింగ్స్ ఖాతాను మూసేయాలనుకుంటున్నారో అందులో ఎంత నగదు ఉందన్నది తప్పక చూసుకోవాలి. అలాగే బ్యాంక్ స్టేట్మెంట్ను తీసుకొని కనీసం 2-3 ఏండ్లు దాచుకోవాలి. దీనివల్ల ఏదైనా లావాదేవీ గురించి తెలుసుకోవాలంటే సులభమవుతుంది. అంతేగాక ఐటీ రిటర్నుల దాఖలుకూ ఈ స్టేట్మెంట్ పనికొస్తుంది.
ఖాతాలో సరిపడా నగదు నిల్వలు లేకపోతే దానికి సంబంధించిన బకాయిల్ని చెల్లించకుండా ఆ ఖాతాను మూసేందుకు బ్యాంకులు ఒప్పుకోవు. అలాగే ఇతర సేవలకు సంబంధించిన చార్జీలనూ తప్పక చెల్లించాలి. లేకపోతే మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోయే వీలున్నది. ఖాతా క్లోజింగ్ చార్జీలూ ఉంటాయన్నది మరువద్దు.
ఆటో, గృహ తదితర రుణాలకు సంబంధించిన ఈఎంఐలు.. క్లోజ్ చేసే ఖాతా నుంచే నెలనెలా కట్ అవుతుంటే వాటన్నింటిని మరో ఖాతాకు ముందుగానే బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే డిఫాల్టర్ ముద్రపడే ప్రమాదమున్నది. అంతేగాక పెట్టుబడులు, ఈపీఎఫ్వో, ఇతర ప్రభుత్వ పథకాలకు ఈ ఖాతానే లింకై ఉంటే మార్పించుకోవాలి.