Health Insurance | పెండ్లి తర్వాత ప్రతి మహిళ జీవితంలో ప్రెగ్నెన్సీ మధురమైన అనుభూతుల్ని మిగులుస్తుంది. అత్యంత కీలక దశ ఇది. ప్రెగ్నెన్సీ దశలోనే తల్లీ బిడ్డల ఆరోగ్యం కాపాడుకోవడాల్సిన అవసరం ఉంటుంది. ప్రెగ్నెన్సీ వచ్చిన ప్రతి మహిళ ప్రసవం వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు వైద్య పరీక్షలు/ సేవలు అంటే ఖర్చుతో కూడుకున్న పని. సాధారణ ప్రసవమైతే పర్వాలేదు కానీ.. సర్జరీ చేయాల్సివస్తే హాస్పిటల్ బిల్లు తడిచి మోపెడవుతుంది.
ఈ తరుణంలో మహిళల ప్రసవానికి కవరేజీ గల ఆరోగ్య బీమా పాలసీలు కూడా ఉన్నాయి. ఈ బీమా పాలసీ తీసుకున్న వారికి అవసరమైన టైంలో ఆర్థిక సాయమందిస్తుంది. ప్రసవం తర్వాత కూడా తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉపకరిస్తుంది. ఈ తరహా ఆరోగ్య బీమా పాలసీలు కొనుగోలు చేయడానికి ముందు వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడం మరిచిపోవద్దు. పలు సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లకు ప్రసవం, డెలివరీ ఖర్చుల కవరేజీ ఉంటది. కనుక సాధ్యమైనంత వరకు స్పెషల్గా మెటర్నిటీ ఇన్సూరెన్స్ పాలసీ తసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు.
ప్రసవం ఖర్చులు అత్యంత కీలకం. ప్రసవం తీరును బట్టి చార్జీలు ఉంటాయి. ఇటీవల పలు ఇన్సూరెన్స్ కంపెనీలు సమగ్ర హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో ప్రసూతి ఖర్చుల కవరేజీ అందిస్తున్నాయి. ఇటువంటి పాలసీలకు వెయిటింగ్ పీరియడ్ ఉంటది. ఇన్సూరెన్స్ కంపెనీని బట్టి రెండు నుంచి నాలుగేండ్ల వరకు వేచి ఉండాల్సి వస్తుంది. పిల్లలు కావాలనుకున్న వారు కనీసం మూడు నుంచి నాలుగేండ్ల ముందే తమకు తగ్గ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేయడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.
పలు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఎటువంటి అడిషనల్ ప్రీమియం చెల్లించనవసరం లేకుండానే నవజాత శిశువుల వైద్య ఖర్చులకు కవరేజీ కల్పిస్తాయి. ఈ తరహా కవరేజీ శిశువు పుట్టిన 91వ రోజు నుంచి మొదలవుతుంది. కొన్ని పాలసీల్లో పుట్టిన రోజు లేదా 16 రోజు నుంచి శిశు వైద్య ఖర్చుల కవరేజీ ఆప్షన్ ఇస్తాయి. అటువంటి పాలసీలతో శిశువు పుట్టినప్పటి నుంచే వైద్య సాయం అందుబాటులోకి వస్తుంది. మహిళల ఆరోగ్యానికి గల ప్రాముఖ్యం దృష్ట్యా పలు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రసవానికి ముందూ తర్వాత చికిత్సలకు కవరేజీ ఆప్షన్ ఇస్తున్నాయి.
కొంత మంది పిల్లలు లోపాలతో జన్మిస్తారని వైద్య పరీక్షల్లో తెలుస్తుంది. అటువంటప్పుడు అలా పుట్టుకతో వచ్చే లోపాలను సవరించి.. శిశువులకు మెరుగైన దీర్ఘకాలిక ఆరోగ్యం కల్పించడానికి గర్భాశయంలోని పిండానికి శస్త్రచికిత్స అవసరం. దేశంలోని పలు ఇన్సూరెన్స్ సంస్థలు కూడా ఈ కవరేజీతో కూడిన బీమా పాలసీలు అందుబాటులోకి తెచ్చాయి. ఈ కవరేజీ గల చికిత్సకు వెయిటింగ్ పీరియడ్ నిబంధన వర్తించదు.
కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో సంతానోత్పత్తి కోసం సహాయ పునరుత్పత్తి చికిత్సలకు కూడా ఇన్సూరెన్స్ కవరేజీనిస్తాయి. మహిళలకు ట్యూబెక్టమీ ఖర్చులు కవరేజీ కల్పించే పాలసీలు ఉన్నాయి. 22 ఏండ్లు దాటిన వివాహితలకు ఈ చికిత్స అందుబాటులో ఉంది కానీ వెయిటింగ్ పీరియడ్ వర్తిస్తుంది. ఇక నవజాత శిశువులకు 12 నెలల వరకు వ్యాక్సినేషన్ కవరేజీతో కూడిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. ఐసీయూ, కన్సల్టేషన్ ఫీజు కూడా కొన్ని పాలసీల్లో కవర్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో అనూహ్య ప్రమాదాలతో జరిగే అబార్షన్ చికిత్స ఖర్చులకు కవరేజీ లభిస్తుంది.
దేశవ్యాప్తంగా కేవలం ఐదు శాతం కంపెనీలు మాత్రమే తమ సిబ్బందికి హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ అండ్ డిజెబిలిటీ ఇన్సూరెన్స్, టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ తోపాటు సమగ్ర బీమా కవరేజీ కల్పిస్తున్నాయని ఇటీవల ఓ సర్వేలో తేలింది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాట్ ఫామ్ ప్లమ్ రూపొందించిన నివేదిక గతనెలలోనే వెలుగు చూసింది.