న్యూఢిల్లీ: మీరు సీనియర్ సిటిజన్ క్యాటగిరీలోకి వచ్చేశారా.. అయితే, మీకో గుడ్ న్యూస్.. సీనియర్ సిటిజన్ల క్యాటగిరీలో ఇన్వెస్ట్ చేయడానికి స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలు అమలులోకి తెచ్చాయి నాలుగు బ్యాంకులు. భారతీయ స్టేట్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాస్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్లలో నగదు జమ చేస్తే సరి.
వారికి అదనంగా వడ్డీరేటు అందిస్తున్నట్లు ప్రకటించాయి. చాలా కాలం తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ తన గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీ డెడ్‌లైన్‌ను పొడిగించింది. కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి సీనియర్ సిటిజన్ల కోసం బ్యాంకులు ప్రత్యేక ఎఫ్డీ స్కీంలు ప్రవేశపెట్టాయి.
సీనియర్ సిటిజన్ల కోసం ఎస్బీఐ.. వుయ్ కేర్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన వారికి అదనంగా 30 బేసిక్ పాయింట్ల వడ్డీ కలిసి వస్తుంది. సుదీర్ఘ కాలం ఇన్వెస్ట్ చేస్తే 6.20 శాతం వడ్డీరేటు వర్తిస్తుంది.
ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ సీనియర్ సిటిజన్ల పెట్టుబడులపై అధిక వడ్డీరేట్లు ఆఫర్ చేస్తోంది. ఇందులో ఎఫ్డీలు చేసిన సీనియర్ సిటిజన్లు 6.30 శాతం వడ్డీరేటు పొందుతారు. ఈ స్కీం అమలు గడువును 2021 అక్టోబర్ ఏడో తేదీకి పొడిగించారు.
ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. సీనియర్ సిటిజన్ల కోసం సీనియర్ సిటిజన్ కేర్ ఎఫ్డీ అని స్పెషల్ ఎఫ్డీ స్కీం అమలులోకి తీసుకొచ్చింది. ఈ స్కీం కింద డిపాజిట్లు చేసిన ఇన్వెస్టర్లకు 6.25 శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ సిటిజన్ల కోసం స్పెషల్ ఎఫ్డీ ఇన్వెస్ట్మెంట్ స్కీం తీసుకొచ్చింది. మీరు సీనియర్ సిటిజన్ అయితే.. ఐదేండ్ల నుంచి పదేండ్ల గడువు గల ఎఫ్డీ స్కీంల్లో ఇన్వెస్ట్ చేయండి. ఈ స్కీం కింద పెట్టుబడి పెట్టిన వారికి అదనంగా ఒకశాతంతో 6.25 శాతం వడ్డీ అందిస్తున్నది.