అమెరికా పారిశ్రామికవేత్త, గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. ప్రపంచంలోనే అత్యంత కుబేరుడి కిరీటాన్ని దక్కించుకున్నారు. ఇప్పటి వరకు ప్రపంచంలోకెల్లా అత్యంత సంపన్నుడిగా ఉన్న అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‌ను దాటేసి మొదటి స్థానానికి చేరుకున్నారని ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించింది. భారీ స్థాయిలో 200 బిలియన్ల డాలర్ల వ్యక్తిగత సంపద సంపాదించిన మూడో వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు.
ఈ సందర్భంగా ఎలన్‌మస్క్ ఓ షార్ట్ ఈ-మెయిల్ పంపారు. ప్రపంచంలో రెండో సంపన్నుడిగా ఉన్న జెఫ్ బెజోస్‌కు డిజిట్ 2 అని పేర్కొంటూ సిల్వర్ మెడల్ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఆ మెయిల్లో పేర్కొన్నారని ఫోర్బ్స్ మ్యాగజైన్ కథనం పేర్కొంది.
అంతరిక్ష పరిశోధనలో పోటీ పడుతున్న ఇద్దరు బిలియనీర్లు కూడా న్యాయ పోరాటానికి దిగారు. ఎలన్ మస్క్ స్పేస్ ఏజెన్సీకి స్పేస్ ఎక్స్‌కు నాసా కాంట్రాక్ట్ ఇవ్వడానికి వ్యతిరేకంగా ఆగస్టులో జెఫ్ బెజోస్ కోర్టు మెట్లెక్కారు. 2020 ఆగస్టు వరకు జెఫ్ బెజోస్ సంపద 200 బిలియన్ల డాలర్లు. ఈ ఏడాది జనవరిలో స్వల్ప కాలం ప్రపంచంలోకెల్లా సంపన్న వ్యక్తిగా ఎలన్‌మస్క్ నిలిచారు.
జెఫ్ బెజోస్, ఎలన్‌మస్క్.. ప్రపంచంలోనే అత్యంత కుబేరుడి టైటిల్ కోసం ఈ ఏడాదిలో పలుసార్లు పోటీ పడ్డారు. మంగళవారం ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో ఎలన్‌మస్క్ తొలి స్థానంలోకి రాగా, జెఫ్ బెజోస్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఫ్రాన్స్ లగ్జరీ గూడ్స్ సంస్థ ఎల్వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ అర్నాల్ట్ మూడో ర్యాంక్ పొందారు.