న్యూఢిల్లీ, జూలై 30: డెరివేటివ్ ట్రేడింగ్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాలపాడటంలో భాగంగా స్పెక్యూలేషన్ను అరికట్టడానికి కనీస కాంట్రాక్ట్ విలువ, ఆప్షన్ ప్రీమియంలను ముందస్తు సేకరణ అవసరమని సూచించింది.
ఫ్యూచర్స్, ఆప్షన్ ట్రేడ్లపై సెక్యూరిటీస్ ట్రాన్సక్షన్ ట్యాక్స్‌ను పెంచుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో తీసుకున్న నిర్ణయం కొన్ని రోజుల తర్వాత సెబీ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. డెరివేటివ్ ట్రేడింగ్‌ల్లో రిటైల్ ఇన్వెస్టర్లు పెరగడంపై ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. వారాంతపు ఇండెక్స్‌లను హేతుబద్దీకరించడంతోపాటు పరిమితులను ఎల్లప్పుడూ పర్యవేక్షించాలని పేర్కొంది. ఈ ప్రతిపాదనలపై ఆగస్టు 20లోగా ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించాలని సెబీ సూచించింది.