ఎన్ఎస్ఈ నిఫ్టీ 18,887 పాయింట్ల రికార్డుస్థాయి నుంచి బ్రేక్అవుట్ జరిగినంతనే వేగంగా 19,500 స్థాయిని సైతం అందుకుంది. అయితే శుక్రవారం 19,524 పాయింట్ల గరిష్ఠస్థాయి నుంచి భారీగా క్షీణించి 19,303 పాయింట్ల కనిష్ఠస్థాయికి తగ్గింది. వారం మొత్తంమీద 143 పాయింట్ల లాభంతో 19,332 వద్ద ముగిసినప్పటికీ, డెయిలీ చార్టుల్లో గత ఏడు రోజుల హయ్యర్ లో ప్యాట్రన్ బ్రేక్డౌన్ అయ్యిందని టెక్నికల్ అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. అయితే వీక్లీ చార్టుల్లో 15 వారాలుగా నెలకొంటున్న హ య్యర్ లో మాత్రం కొనసాగడం సాంకేతికంగా సానుకూలాంశమని వివరించారు. జూలై సమీక్షలో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు తప్పదన్న సంకేతాలు రావడంతో గ్లోబల్ మార్కెట్లు ఒడిదుడుకుల బాటపట్టిన నేపథ్యంలో భారత్ సూచీలు సైతం విస్త్రత శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనుకావచ్చని అంచనా వేస్తున్నారు.
వీక్లీ చార్టుల్లో హయ్యర్ లో ప్యాట్రన్ కొనసాగాలంటే నిఫ్టీ 19,300 స్థాయిని వదులుకోకూడదని, ఆ సందర్భంలో 19,420, 19,525 స్థాయిల్ని అందుకోవచ్చని మోతీలాల్ ఓస్వాల్ రీసెర్చ్ హెడ్ చందన్ తపారియా అంచనా వేశారు. 19,300 దిగువన 19,250, 19100 పాయింట్ల వరకూ తగ్గవచ్చన్నారు. ఈ వారం నిఫ్టీకి 19,425 స్థాయి గట్టిగా నిరోధించవచ్చని, 19,200 పాయింట్ల వద్ద మద్దతు పొందవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అనలిస్ట్ నాగరాజ్ షెట్టి విశ్లేషించారు.