Credit Card | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: యువతలో పెరుగుతున్న క్రెడిట్ కార్డుల వినియోగం పెడదారి పడుతున్నది. ఓ వైపు క్రెడిట్ స్కోర్లపై అవగాహనను పెంచుకుంటూనే.. మరోవైపు క్రెడిట్ కార్డులను విచ్చలవిడితనంతో వాడేస్తున్నారు. స్వైప్ చేద్దాం, ఎడాపెడా ఖర్చు పెడదాం, ఆ మొత్తాలను తిరిగి చెల్లించకుండా ఎగవేద్దాం.. అన్న రీతిలో చాలామంది క్రెడిట్ కార్డు యూజర్లు, ముఖ్యంగా మిల్లేనియల్స్ (1981-1996 మధ్య జన్మించినవారు) ఉండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నది మరి. ప్రముఖ క్రెడిట్ రేటింగ్ సమాచార సంస్థ, ట్రాన్స్‌యూనియన్ సిబిల్ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ఒకింత విస్తుపోయే నిజాలే వెలుగుచూశాయి. బై నౌ, పే లేటర్ (ఇప్పుడు కొనండి, తర్వాత తీరిగ్గా చెల్లించండి) సంస్కృతికి యంగ్ మిల్లేనియల్స్ అలవాటు పడిపోయిన తీరు స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ-కామర్స్ వేదికలపై చేసే ఆన్లైన్ షాపింగ్‌ల్లో ఈఎంఐలతో జరుగుతున్న కొనుగోళ్లే ఎక్కువగా ఉండటాన్నిబట్టి పరిస్థితుల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
క్రెడిట్ కార్డులను సక్రమంగా వినియోగించుకుంటే ఎన్ని లాభాలున్నాయో.. దారితప్పితే అన్ని నష్టాలూ ఉన్నాయి. సిబిల్ వివరాల ప్రకారం క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్స్ ఈ ఏడాది జూన్ నాటికి 1.8 శాతానికి పెరిగాయి. 6 నెలల క్రితం ఇది 1.7 శాతంగా ఉండగా, గత ఏడాది మార్చిలో 1.6 శాతంగా ఉన్నది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే క్రెడిట్ కార్డుల బకాయిలు ఈ జూన్‌దాకా రూ.2.7 లక్షల కోట్లుగా ఉన్నాయి. మార్చిలో రూ.2.6 లక్షల కోట్లుగా ఉన్నట్టు సిబిల్ తెలియజేసింది. నిరుడు మార్చిలో రూ.2 లక్షల కోట్లే. నిజానికి కరోనాకు ముందు 2019 మార్చిలో మొత్తం బకాయిలు రూ.87,686 కోట్లుగానే ఉన్నాయి. కానీ ఆ తర్వాతి ఐదేండ్లలో మూడింతలు ఎగిశాయి. చక్ర వార్షిక వృద్ధిరేటు (సీఏజీఆర్) 24 శాతంగా నమోదైంది. కాగా, 1-2 నెలలపాటు చెల్లించకపోతే బ్యాంకులు బకాయిలుగా భావిస్తాయి. ఆపై 6 నెలలపాటు చెల్లించకపోతే దాన్ని డిఫాల్ట్‌గా పరిగణిస్తాయి.
క్రెడిట్ కార్డుపైనున్న మొత్తం నగదు పరిమితిని యువత వాడేస్తున్నది. ఆన్లైన్ షాపింగ్‌లలో స్మార్ట్ఫోన్లు, బట్టలు, షూస్ కొనుగోళ్ల కోసం ఎక్కువగా క్రెడిట్ కార్డులనే యంగ్ మిల్లేనియల్స్ ఆశ్రయిస్తున్నారు. అనవసరపు ఖర్చులకు దిగుతూ.. తిరిగి వాటిని చెల్లించలేక చేతులెత్తేస్తున్నారు. చివరకు అవి మొండి బకాయిలుగా మారుతున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో గృహ రుణాల వంటి కీలకమైన ఆర్థిక సాయాన్ని పొందలేని పరిస్థితి వస్తున్నది. కాబట్టి క్రెడిట్ కార్డులు ఇస్తున్నారు కదా అని తీసుకోవద్దు. అవసరం ఉంటేనే తీసుకోవాలి. లేకపోతే వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది.
1. న్యాయపరంగా క్రెడిట్ కార్డును వాడుకుని, ఆ మొత్తాలను చెల్లించకపోతే బ్యాంకులు లీగల్ యాక్షన్స్ తీసుకోవడానికి అవకాశా లున్నాయి. సివిల్ స్యూట్ లేదా క్రిమినల్ కేసునూ పెట్టడానికి వీలున్నది. దీనివల్ల ఆర్థిక నష్టమేగాక, డిఫాల్టర్ ముద్ర అధికారికంగా పడుతుంది. చెల్లింపులు జరుపకపోతే జైలు శిక్షలకూ ఆస్కారం ఉన్నది.
2. డెట్ కలెక్షన్ ఏజెన్సీలకు తమ సొమ్మును తిరిగి వసూలు చేసుకోవడంలో భాగంగా డిఫాల్టర్ల వివరాలను డెట్ కలెక్షన్ ఏజెన్సీ (రుణ వసూలు సంస్థ)లకు బ్యాంకులు అప్పగించే వీలున్నది. బకాయిల వసూళ్లలో ఈ ఏజెన్సీలు ఎటువంటి కఠిన చర్యలకు దిగుతాయో చూస్తూనే ఉన్నాం. డిఫాల్టర్లు ఒకవేళ పారిపోతే వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, పరిచయస్తులకూ తిప్పలు తప్పవు.
3. క్రెడిట్ స్కోర్ డౌన్ రుణగ్రహీతలు తమ అప్పులను సకాలంలో చెల్లించకపోతే వారి క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. ఈ క్రెడిట్ స్కోర్ ఆధారంగానే బ్యాంకులు, ఇతరత్రా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు రుణాల మంజూరు, వడ్డీరేట్లపై నిర్ణయం వంటివి చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారి ఎగవేతదారు ముద్రపడితే భవిష్యత్తులో మరే రకమైన రుణాల్నైనా అందుకోవడం చాలాకష్టతరం.
4. తక్కువ రుణ పరిమితి ఒక బ్యాంక్‌లో క్రెడిట్ కార్డు బకాయిల ఎగవేతలకు పాల్పడినవారికి ఇతర బ్యాంకుల్లోనూ ఇబ్బందులు తప్పవు. క్రెడిట్ కార్డ్పైనుండే నగదు పరిమితి తగ్గిపోతుంది. ఆఫర్లూ పెద్దగా ఉండవు. ఇంకొన్ని బ్యాంకులైతే క్రెడిట్ కార్డులను ఇచ్చేందుకూ ముందుకు రావు.