న్యూఢిల్లీ, ఆగస్టు 24: చంద్రయాన్-3 ల్యాండర్ విజయవంతంగా చందమామపై పాగావేయడంతో ఆ ప్రాజెక్టులో పాలుపంచుకున్న కంపెనీల షేర్లు గురువారం ట్రేడింగ్ ప్రారంభంలో పెద్ద ఎత్తున ర్యాలీ జరిపాయి. నూతన శిఖరాల్ని తాకాయి. అయితే కొద్ది రోజులుగా అదేపనిగా పెరుగుతున్న ఈ షేర్ల నుంచి ఇన్వెస్టర్లు లాభాల్ని స్వీకరించడంతో వీటిలో మెజారిటీ షేర్లు నష్టాలతో ముగిసాయి. హెవీవెయిట్ స్టాక్స్ లార్సన్ అండ్ టూబ్రో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, బీహెచ్ఈఎల్, మిశ్రధాతు నిగమ్లు 1-3 శాతం మధ్య తగ్గాయి. అస్త్ర మైక్రోవేవ్ స్వల్పంగా నష్టపోయింది. మరోవైపు కొన్ని కంపెనీలు వాటి రికార్డు గరిష్ఠస్థాయి నుంచి కొంత తగ్గినప్పటికీ, అధిక శాతం లాభాల్ని నిలుపుకున్నాయి. సెంట్రమ్ ఎలక్ట్రానిక్స్ 7 శాతం, హైదరాబాద్ కంపెనీ ఎంటార్ టెక్నాలజీస్ 3 శాతం, పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ 6 శాతం చొప్పున పెరిగాయి. భారత్ ఫోర్జ్ స్వల్ప లాభంతో నిలిచింది. ట్రేడింగ్ తొలిదశలో సెంట్రల్ 19 శాతం, పరాస్ 17 శాతం, ఎంటార్ టెక్ 10 శాతంపైగా ర్యాలీ జరిపాయి.