Shock For Elon Musk | గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలన్‌మస్క్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. భారత్‌లో టెస్లా ఎంట్రీ విషయమై సంస్థ యాజమాన్యం చేస్తున్న తాత్సారంపై ఆ సంస్థ భారత్ పాలసీ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ మనూజ్ ఖురానా విసిగిపోయారు. దిగుమతి చేసుకుంటున్న కార్లపై దిగుమతి సుంకం తగ్గించాలంటూ కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటి వరకు మనూజ్ ఖురానా సారధ్యంలోని టెస్లా ఇండియా టీం లాబీయింగ్ నిర్వహించింది. ఇలా భారత్ మార్కెట్లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నప్పుడే గతేడాది మార్చిలో టెస్లా పాలసీ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్‌గా మనూజ్ ఖురానా నియమితులయ్యారు.
ఎలన్‌మస్క్ సూచనలకు అనుగుణంగా దిగుమతి కార్లపై సుంకాలు తగ్గించుకోవాలని కేంద్రంతో మనూజ్ ఖురానా సంప్రదింపులు జరిపారు. తక్కువ సుంకంతో కార్ల దిగుమతికి అనుమతించాలని, భారత్ మార్కెట్లో విక్రయాలను బట్టి దేశీయంగా మాన్యుఫాక్చరింగ్పై నిర్ణయానికి వస్తామని టెస్లా చెబుతున్నది. టెస్లాకు చైనా కూడా ఇలాగే అనుమతులిచ్చిందని మనూజ్ ఖురానా కేంద్రానికి వివరించారు. కానీ కేంద్రం మాత్రం దిగుమతి సుంకం తగ్గింపు విషయమై ససేమిరా అంది. కేవలం టెస్లాకు మాత్రమే మినహాయింపులు ఇవ్వలేం అని తేల్చేసింది. దీంతో టెస్లా సీఈవో ఎలన్‌మస్క్ నిత్యం భారత్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా అసంతృప్తి వెళ్లగక్కుతూనే ఉన్నారు.
స్థానికంగా ఉత్పత్తి ప్రారంభించాకే రాయితీలపై చర్చించాలని టెస్లా ఇండియా టీంకు కేంద్రం తెలిపింది. దీంతో భారత్ మార్కెట్లోకి ఎంటరయ్యే విషయాన్ని పక్కన బెట్టిన టెస్లా.. తాజాగా థాయిలాండ్, ఇండోనేషియా మార్కెట్లలోకి ప్రవేశించడంపై దృష్టి సారించింది. భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లో షోరూమ్‌లు వెతికే ప్రయత్నాలు కూడా నిలిపేసింది. ఇక్కడి పనులు మరో టీమ్‌కు అప్పగించడంతో టెస్లాకు మనూజ్ ఖురానా గుడ్‌బై చెప్పారు. భారత్ మార్కెట్లోకి ఎంట్రీ విషయమై టెస్లా యాజమాన్యం అనుసరిస్తున్న సాచివేత ధోరణి వల్లే ఆయన ఆ సంస్థను వీడినట్లు సమాచారం. దీనిపై స్పందించేందుకు మనూజ్ ఖురానా అందుబాటులో లేరు.