
Elon Musk on TIMES | అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌కు అరుదైన గౌరవం దక్కింది. టైమ్స్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ఇయర్ 2021గా ఎంపికయ్యారు. అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ ఎక్స్‌కు కూడా ఆయన సీఈవోగా ఉన్నారు. ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుడిగా అవతరించిన సంగతి తెలిసిందే. తన ఆటోమొబైల్, స్పేస్ ట్రావెల్ రంగాల భవితవ్యాన్ని రూపుదిద్దడంతోపాటు వ్యక్తిగతంగా, తన వ్యాపార లావాదేవీలను ముందుకు తీసుకెళ్లడంలో ఎలన్‌మస్క్ నిత్యం వార్తల్లో వ్యక్తిగా ఉన్నారు.
కేవలం ఒక్క ట్వీట్‌తోనే క్రిప్టో కరెన్సీ, మార్కెట్ల విలువలను నిర్దేశించగల సత్తా ఎలన్‌మస్క్ సొంతం. ఆయనకు 6.6 కోట్ల మంది ట్విట్టర్ ఫాలోయర్లు ఉన్నారు. స్పేస్ ఎక్స్‌గా పేరొందిన స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఒక చైల్డ్ క్యాన్సర్ సర్వైవర్తోపాటు పూర్తి పౌర సిబ్బందితో తొలి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించింది. 2002లో ఎలన్‌మస్క్.. స్పేస్ ఎక్స్‌ను ప్రారంభించారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాతో కలిసి వివిధ ఉపగ్రహాల ప్రయోగంలో ఎలన్‌మస్క్ సారధ్యంలోని స్పేస్ఎక్స్ పాల్గొన్నది.
బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కుబేరుడు ఎలన్‌మస్క్. ఆయన నికర సంపద సుమారు 266 బిలియన్ల డాలర్లు. గత అక్టోబర్‌లో టెస్లా మార్కెట్ క్యాపిటలైజేషన్.. లక్ష కోట్లడాలర్ల మైలురాయిని అధిగమించింది. 1927 నుంచి ప్రతి క్యాలెండర్ ఇయర్ ముగింపులో పర్సన్ ఆఫ్ ది ఇయర్ వార్తా కథనాన్ని టైమ్స్ మ్యాగజైన్ ప్రచురిస్తున్నది. ఆ వ్యక్తి ఫొటోను కవర్‌పేజీపై ముద్రిస్తుంది. ఏడాది కాలంలో వివిధ అంశాల్లో ఆయా వ్యక్తుల ఇన్ఫ్ల్యూయెన్స్ ఆధారంగా పర్సన్ ఆఫ్ ది ఇయర్`ను ఎంపిక చేస్తుంది.