న్యూఢిల్లీ, డిసెంబర్ 3 : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో దేశీయ టెలికం రంగ సేవా సంస్థల స్థూల ఆదాయం లక్ష కోట్ల రూపాయలకు చేరువైంది. గతంతో పోల్చితే 9.19 శాతం ఎగబాకి రూ.99, 828 కోట్లుగా నమోదైంది. ఈ మేరకు టెలికం రంగ రెగ్యులేటర్ ట్రాయ్ బుధవారం విడుదల చేసిన ఓ నివేదికలో వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25) ఇదే త్రైమాసికంలో మొబైల్ సర్వీసెస్, ఇంటర్నెట్ సర్వీసెస్ కంపెనీలు తదితర టెలికం సర్వీస్ ప్రొవైడర్లు రూ.91,426 కోట్ల ఆదాయాన్ని పొందాయి.
ఇక ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో రూ.96, 646 కోట్లకు పెరిగింది. ఆ తర్వాతి 3 నెలల్లో ఇంకా పెరిగినట్టు తేలింది. కాగా, ఈసారి సర్దుబాటు స్థూల ఆదాయం (ఏజీఆర్) 9.35 శాతం పుంజుకొని రూ.82, 348 కోట్లుగా ఉన్నది. నిరుడు జూలై-సెప్టెంబర్లో రూ.75,310 కోట్లు. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ మొదలైన వాటన్నిటి ఏజీఆర్ కలిపితే రూ.69,229.89 కోట్లుగా ఉన్నది. మొత్తం ఏజీఆర్లో ఇది దాదాపు 84 శాతానికి సమానం.