Swiggy | ప్రముఖ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ స్విగ్గీ (Swiggy) ఐపీఓ ద్వారా బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్టయింది. ఐపీఓ నిర్ణేత ధర కంటే 18.9 శాతం ప్రీమియంతో ట్రేడింగ్ ముగిసింది. స్టాక్ మార్కెట్లు – ఎన్ఎస్ఈ లో ట్రేడింగ్ మొదలయ్యే సరికి రూ.420 వద్ద స్విగ్గీ షేర్ ట్రేడింగ్ ప్రారంభమైంది. అంటే ఐపీఓ జారీ షేర్ ధర రూ.390తో పోలిస్తే ఎనిమిది శాతం ఎక్కువ అన్నమాట. మధ్యాహ్నం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఎన్ఎస్ఈలో స్విగ్గీ షేర్ 18.97 శాతం వృద్ధితో రూ.464 వద్ద స్థిర పడింది. ఇక బీఎస్ఈలో 5.64 శాతం ప్రీమియంతో రూ.412 వద్ద స్విగ్గీ షేర్ ట్రేడింగ్ మొదలైంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 16.9 శాతం ప్రీమియంతో రూ.455.95 వద్ద నిలిచింది. ఈ నెల ఎనిమిదో తేదీన ముగిసిన స్విగ్గీ ఐపీఓలో తొలి రెండు రోజులు అంతంత మాత్రంగా సబ్ స్క్రిప్షన్ జరిగినా చివరి రోజు మాత్రం ఇన్వెస్టర్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. స్విగ్గీ ఐపీఓ షేర్ ధరల శ్రేణి రూ.371-390గా నిర్ణయించారు. తాజాగా కొత్త షేర్ల జారీ ద్వారా రూ.4,499 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా రూ.6,828 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది స్విగ్గీ.
రూ.11,327 కోట్ల ఐపీఓలో చివరి రోజూ 3.599 రెట్లు సబ్ స్క్రిప్షన్లు దాఖలయ్యాయి. అంటే 16 కోట్లకు 57.53 కోట్ల బిడ్లు దాఖలయ్యాయి. క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటాలో 6.02 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 1.14 రెట్ల సబ్ స్క్రిప్షన్లు నమోదయ్యాయి. కానీ, నాన్ ఇన్ స్టిట్యూషనల్ కోటాలో 41 శాతమే సబ్ స్క్రిప్షన్ నమోదైంది. అంతకు ముందు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి స్విగ్గీ రూ.5,085 కోట్ల నిధులు సేకరించింది.
స్విగ్గీ ఐపీఓకు వెళ్లడంతో అందులో పని చేస్తున్న 500 మంది ఉద్యోగులు కోటీశ్వరులు అయ్యారు. ఎంప్లాయిస్ స్టాక్ ఆప్షన్ ప్లాన్ కింద అర్హులైన ఉద్యోగులకు కంపెనీ గతంలోనే షేర్లు కేటాయించింది. దీంతో బుధవారం ఈక్విటీ మార్కెట్లలో షేర్లు రూ.420 వద్ద లిస్టింగ్ కావడంతో షేర్ల విలువ అమాంతం పెరిగింది. దాదాపు 500 మంది ఉద్యోగుల్లో ఒక్కొక్కరి దగ్గర గల షేర్ల విలువ రూ.2 కోట్లకు చేరుకున్నది. మొత్తం 5,000 మందికి గతంలో కేటాయించిన స్టాక్ ఆప్షన్ల విలువ సుమారు రూ.9,000 కోట్ల పై చిలుకు ఉంటుందని భావిస్తున్నారు.