ముంబై, ఏప్రిల్ 5: తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి వంటనూనెల ధరలు. ఓవైపు దేశంలో పెరుగుతూపోతున్న ఇంధన ధరలతో రవాణా భారం.. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పడిపోతున్న సరఫరాల కారణంగా మార్కెట్లో లీటర్ ధర డబుల్ సెంచరీలు కొడుతున్నది. ఎలాంటి వంటనూనె ధరైనా ఇప్పుడు లీటర్ కనిష్ఠంగా రూ.160 నుంచి గరిష్ఠంగా రూ.340 పలుకుతున్నదంటే అతిశయోక్తికాదు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దండయాత్ర.. మున్ముందు భారత్‌లో ద్రవ్యోల్బణాన్ని మరింత ఎగదోస్తుందన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 4-6 లక్షల టన్నుల ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్ కొరత ఏర్పడవచ్చని హెచ్చరిస్తున్నారు.
ధరలు పైపైకే..: గడిచిన నెలన్నర రోజుల్లో వంటనూనెల ధరలు లీటర్‌కు 25-40 శాతం పెరిగాయని పరిశ్రమ వర్గాలు, నిపుణులు చెప్తున్నారు. కాగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం.. ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్ సరఫరాపై కనిపిస్తుండగా, బ్రెజిల్లో పంటలు దెబ్బతినడంతో ముడి సోయాబీన్ ఆయిల్, ఇండోనేషియా, మలేషియాల్లో ఉత్పత్తి తగ్గడంతో ముడి పామాయిల్ కొరతకు దారితీస్తున్నది. ఎస్ఈఏ వివరాల ప్రకారం ఉక్రెయిన్, రష్యా, అర్జెంటీనాల నుంచి ఏటా 20 లక్షల టన్నుల ముడి సన్‌ఫ్లవర్ ఆయిల్ భారత్‌కు దిగుమతి అవుతున్నది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రతీ దేశాన్ని ఏదో ఓ రకంగా ఈ యుద్ధం ప్రభావితం చేస్తూనే ఉన్నది. ముఖ్యంగా భారత్‌కు వార్ దెబ్బ గట్టిగానే తగులుతున్నది.ఇప్పటికే దేశంలో విజృంభిస్తున్న ద్రవ్యోల్బణాన్ని.. ఈ అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు మరింతగా ఎగదోస్తున్నాయి. లీటర్ వంటనూనె డబుల్ సెంచరీ కొట్టడం ఇందుకు నిదర్శనం.
ధరలు పెంచకండి: ఎస్ఈఏ
వంటనూనెల ధరలు భగ్గుమన్న నేపథ్యంలో ఇంకా పెంచవద్దంటూ తమ సభ్య వంటనూనెల తయారీ సంస్థలకు సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) మంగళవారం విజ్ఞప్తి చేసింది. వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా, వారికి అధిక ధరల నుంచి ఊరటనివ్వాలని అసోసియేషన్ సభ్యులకు రాసిన లేఖలో ఎస్ఈఏ అధ్యక్షుడు అతుల్ చతుర్వేది కోరారు. దేశీయ మార్కెట్లో వంటనూనెల ధరలు ఇప్పటికే విపరీతంగా పెరిగాయని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో మరింత ఎగబాకే పరిస్థితులు వచ్చాయని ఈ సందర్భంగా చతుర్వేది ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. ‘వంటనూనెల అధిక ద్రవ్యోల్బణం ప్రభుత్వాలను కలవరపెడుతున్నది. నిజానికి ధరలు దిగుమతులపై ఆధారపడినా.. మార్కెట్లో వంటనూనెలు, నూనెగింజల అక్రమ నిల్వలతోనే ఈ పరిస్థితులు వచ్చాయన్న అనుమానాల్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. మేమైతే అక్రమ నిల్వలకు ఆస్కారమే లేదనుకుంటున్నాం’ అని చతుర్వేది అన్నారు.
మొత్తం దేశీయ వంటనూనెల దిగుమతులు
సన్‌ఫ్లవర్ ఆయిల్ 15.4%
సోయాబీన్ ఆయిల్ 23.1%
పామాయిల్ 61.5%
దేశీయంగా వంటనూనెల ఉత్పత్తి 40.9%
విదేశాల నుంచి దిగుమతులు 59.1%