న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నుంచి అన్ని రంగాలు కోలుకోవడంతో ఈ క్వార్టర్లో (జులై-సెప్టెంబర్) కంపెనీలు పెద్ద ఎత్తున నియామకాలపై దృష్టి సారించనున్నాయి. కొత్త ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని 61 శాతం భారత కంపెనీలు యోచిస్తున్నాయని టీంలీజ్ ఎంప్లాయ్మెంట్ అవుట్‌లుక్ నివేదిక వెల్లడించింది. గత క్వార్టర్‌తో పోలిస్తే కంపెనీల హైరింగ్ ప్రణాళికల్లో ఏడు శాతం వృద్ధి నమోదైందని ఈ నివేదిక తెలిపింది.
ఇంజనీర్లు, టెకీల నియామకాలు 13 శాతం వృద్ధి చెందనుండగా, సేల్స్, ఐటీ హైరింగ్ 8 శాతం పెరగనుంది. తయారీ రంగంలో బ్లూ కాలర్ జాబ్‌లు ఏడు శాతం మేర హైరింగ్‌లో వృద్ధి నమోదు చేశాయి. ఐటీ, సేల్స్ అత్యధిక డిమాండ్ ఉన్న ఉద్యోగాలుగా కొనసాగుతున్నాయి. వీటితో పాటు ఇంజనీరింగ్, మార్కెటింగ్, బ్లూకాలర్ వంటి ఇతర ఉద్యోగాలకూ గిరాకీ పెరగడంతో తాజా క్వార్టర్లో హైరింగ్ ప్రక్రియ జోరుగా సాగుతుందని టీంలీజ్ నివేదిక స్పష్టం చేసింది.
పలు కంపెనీలు హైరింగ్‌కు మొగ్గుచూపడంతో ఉద్యోగావకాశాలు ఊపందుకోనున్నాయని, పీఎల్ఐ స్కీముల్లో ప్రభుత్వ పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కోసం టూరిజం, ఏవియేషన్, హౌసింగ్ రంగాలకు ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజ్ వంటి నిర్ణయాలతో హైరింగ్ ప్రక్రియ జోరందుకుందని టీంలీజ్ సహవ్యవస్ధాపకులు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రితుపర్ణ చక్రవర్తి చెప్పారు. రాబోయే కొద్ది క్వార్టర్లలోనే నియామకాలకు మొగ్గుచూపే కంపెనీలు 70 శాతం మార్క్ దాటతాయని ఆమె పేర్కొన్నారు.