Credit Card | మీ వద్ద ఎస్బీఐ కార్డ్, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నాయా.. ఇంటి నిర్మాణానికో, పిల్లల ఉన్నత విద్యా కోర్సుల కోసమో బీమా పాలసీలపై లోన్ తీసుకున్నారా.. అయితే, ఇక నుంచి బీమా పాలసీలపై తీసుకున్న రుణాల ఈఎంఐలను క్రెడిట్ కార్డుతో చెల్లింపులను అనుమతించవద్దని భారత బీమా అభివృద్ధి నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) ఆదేశించింది. అన్ని బీమా సంస్థలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ నెల నాలుగో తేదీన అన్ని బీమా సంస్థలకు ఐఆర్డీఏఐ ఆదేశాలు జారీ చేస్తూ సర్క్యులర్ జారీ చేసింది. క్రెడిట్ కార్డుల నుంచి బీమా పాలసీలపై రుణ వాయిదాల చెల్లింపును తక్షణం నిలిపేయాలని ఆయా బీమా సంస్థలకు స్పష్టం చేసింది. బీమా పాలసీ రుణాల చెల్లింపులకు క్రెడిట్ కార్డులను వాడితే, సదరు రుణ గ్రహీతలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతారని ఐఆర్డీఏఐ ఆందోళన వ్యక్తం చేసింది.
`బీమా పాలసీలపై తీసుకున్న రుణాల చెల్లింపులకు క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. సంబంధిత కస్టమర్ క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపునకు ఒక నెల రోజుల గడువు మాత్రమే ఉంటుంది. దీనివల్ల స్వల్ప కాలిక (ఒక నెల) వడ్డీ రహిత రుణాలు తీసుకునే అవకాశాలు పెరుగుతాయి. క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులో విఫలమైనా.. జాప్యం చేసినా.. రీ పేమెంట్ డిఫాల్ట్పై అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఫలితంగా సంబంధిత క్రెడిట్ కార్డు కస్టమర్ భారీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకునే అవకాశం ఉంది. అందువల్లే బీమా పాలసీలపై తీసుకున్న రుణాల చెల్లింపులకు క్రెడిట్ కార్డుల వాడకాన్ని నిషేధించడం జరిగింది` అని ఫ్యూచర్ జనరల్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సెక్రటరీ కంజీవరం భరద్వాజ్ తెలిపారు.
`స్వల్పకాలిక అవసరాల కోసం బీమా పాలసీ విలువ లోపు దానిపై బీమా దారుడు రుణాలు తీసుకోవచ్చు. కనీస పీరియడ్ ప్రీమియంలు చెల్లించిన తర్వాత సదరు పాలసీదారు ప్రీమియం పేమెంట్స్ నిలిపేయవచ్చు. సదరు వ్యక్తి తనకు ఇష్టం వచ్చినప్పుడు పాలసీపై తీసుకున్న రుణం చెల్లించొచ్చు. పాలసీలపై తీసుకునే రుణాలపై వడ్డీరేటు సుమారు 9-10 శాతం ఉంటుంది. ఒకవేళ రుణం చెల్లించకపోతే.. సదరు రుణం, పాలసీ విలువ సరిపోతే రుణంతో ఆ పాలసీని సర్దుబాటు చేసి మూసేస్తారు` అని భరద్వాజ్ చెప్పారు.
బీమా పాలసీలపై తీసుకునే రుణాలతో పలు ప్రయోజనాలు ఉన్నాయి. పర్సనల్ లోన్లతో పోలిస్తే బీమా పాలసీ రుణాలపై వడ్డీరేటు తక్కువగా ఉంటుంది. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలతో పోలిస్తే బీమా సంస్థల నుంచి త్వరితగతిన రుణం మంజూరవుతుంది. ఎండోమెంట్, మనీ బ్యాక్, హోల్ లైఫ్ పాలసీలపై రుణ పరపతి లభిస్తుంది. యూలిప్ పాలసీలపై రుణాలివ్వరు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)లో టైర్-2 అకౌంట్ల ప్రీమియం చెల్లింపులకు క్రెడిట్ కార్డు వాడకాన్ని నిలిపేయాలని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.