న్యూఢిల్లీ, ఆగస్టు 22: బంగారం తాకట్టుపై రుణం తీసుకోవాలనుకుంటున్నారా అయితే మీకు సువర్ణ అవకాశం. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, గోల్డ్లోన్లు ఇచ్చే ఆర్థిక సేవల సంస్థలు కేవలం తక్కువ రుణం మంజూరు చేస్తున్నాయి. కానీ ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థయైన సౌత్ ఇండియన్ బ్యాంక్ మాత్రం తాకట్టుపెట్టిన పుత్తడి విలువలో 90 శాతం రుణం మంజూరు చేయనున్నట్టు శుక్రవారం ప్రకటించింది.
ఇందుకోసం బ్యాంక్ ఎస్ఐబీ గోల్డ్ ఎక్స్ప్రెస్ పేరుతో ప్రత్యేక స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కీం కింద ఖాతాదారుడికి వెనువెంటనే రుణాన్ని మంజూరు చేయడంతోపాటు ఎప్పుడైనా తిరిగి చెల్లింపులు జరుపుకునే వీలు కల్పించింది. మూడేండ్ల కాలపరిమితితో రూ.25 వేల నుంచి రూ.25 లక్షల లోపు ఎంతైనా రుణాన్ని మంజూరు చేయనున్నట్టు బ్యాంక్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
చిన్న స్థాయి వ్యాపారస్తులు లక్ష్యంగా చేసుకొని బ్యాంక్ ఈ ప్రత్యేక గోల్డ్ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కీం కింద ఎంఎస్ఎంఈ, నాన్-ఎంఎస్ఎంఈ, చిన్న వ్యాపారస్తులు, కూరగాయల విక్రయదారులు, తమ వ్యాపార విస్తరణకోసం అవసరమయ్యే నిధులు, నిర్వహణ ఖర్చులు లేదా వ్యక్తిగత వెంచర్స్ కోసం అవసరమైన వారికి ఈ రుణాన్ని ఇవ్వనున్నది. రుణ గ్రహీతలకు పారదర్శకంగా, ఎలాంటి అదనపు ఖర్చులు విధించడం లేదు. పూర్తిగా డిజిటల్ రూపంలోనే రుణాన్ని మంజూరు చేస్తున్నది బ్యాంక్. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శాఖల్లో బంగారం తాకట్టుపై రుణాన్ని తీసుకోవచ్చునని తెలిపింది.