ముంబై, నవంబర్ 17: స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్‌పడింది. వ్యక్తిగత రుణాలపై కఠిన ఆంక్షలు విధించాలని రిజర్వు బ్యాంక్ ఆదేశాలతో బ్యాంకింగ్, ఆర్థిక, ఎనర్జీ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు వీసినప్పటికీ ఆర్బీఐ ఆదేశాలు మార్కెట్లను నష్టాలవైపు నడిపించాయి. నష్టాలతో ప్రారంభమైన సూచీలు చివరివరకు ఇదే ట్రెండ్‌ను కొనసాగించాయి. క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులను కుమ్మరించినప్పటికీ భారీ నష్టాలను పరిమితం చేయగలిగాయి. ఒక దశలో 350 పాయింట్ల స్థాయిలో నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 187.75 పాయింట్లు తగ్గి 65,794.73 వద్ద నిలిచింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ 33.40 పాయింట్లు కోల్పోయి 19,713.80 పాయింట్ల వద్ద ముగిసింది.
రిజర్వు బ్యాంక్ దెబ్బకు ఆర్థిక రంగ షేర్లు విలవిలలాడాయి. అన్సెక్యూర్డ్ వ్యక్తిగత రుణాలు మొండి బకాయిలుగా మారుతున్నాయని సెంట్రల్ బ్యాంక్ హెచ్చరించడంతో ఈ రుణాలపై కఠిన నిబంధనలను అమలు చేయాలని బ్యాంకులకు సూచించడంతో బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీ రంగ షేర్లు కుప్పకూలాయి. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ షేరు ఏకంగా 3.64 శాతం తగ్గి టాప్ లూజర్‌గా నిలిచింది. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్ 3.03 శాతం, కెనరా బ్యాంక్ 2.02 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.45 శాతం, ఫెడరల్ బ్యాంక్ 1.40 శాతం చొప్పున తగ్గాయి.
వీటితోపాటు బీవోబీ, కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్‌ల షేర్లు కూడా దిగువకు పడిపోయాయి. బీఎస్ఈ బ్యాంకెక్స్ ఇండెక్స్ 1.48 శాతం తగ్గి 49,170.81కి జారుకున్నది. అలాగే ఆర్బీఎల్ బ్యాంక్ షేరు ఏకంగా 7.82 శాతం కోల్పోయింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 2.11 శాతం, ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ 5.19 శాతం, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసులు 5 శాతం, అర్మాన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 3.17 శాతం, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ 3.08 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.99 శాతం తగ్గాయి. ఆర్బీఐ నిర్ణయం కొంతమేర ప్రభావం చూపుతున్నదని, యూరోజోన్ ద్రవ్యోల్బణ గణాంకాల కోసం పెట్టుబడిదారులు వేచిచూస్తున్నారని దలాల్ స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.
దేశీయ మౌలిక రంగ సంస్థ లార్సెన్ అండ్ టుబ్రో టాప్ గెయినర్‌గా నిలిచింది. హిందుస్థాన్ యునిలీవర్, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, నెస్లె, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లు లాభాల్లో ముగిశాయి. రంగాలవారీగా చూస్తే బ్యాంకింగ్ రంగ సూచీ 1.48 శాతం తగ్గగా, ఆయిల్ అండ్ గ్యాస్ 1.35 శాతం, ఆర్థిక సేవలు, ఐటీ రంగ సూచీలు కూడా దిగువకు పడిపోయాయి. కానీ, ఎఫ్ఎంసీజీ, హెల్త్‌కేర్, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ సూచీలు లాభాల్లో ముగిశాయి. మొత్తంమీద ఈ వారంలో సెన్సెక్స్ 890 పాయింట్లు లేదా 1.37 శాతం, నిఫ్టీ 306.45 పాయింట్లు 1.57 శాతం పెరిగాయి.