మంగళవారం 02 మార్చి 2021
Business - Jan 12, 2021 , 01:22:32

సెన్సెక్స్‌ @ 49,303

సెన్సెక్స్‌ @ 49,303

  • ఐటీ షేర్ల దన్నుతో రికార్డ స్థాయికి సూచీలు
  • సెన్సెక్స్‌ 487నిఫ్టీ 137 పాయింట్ల లాభం

ముంబై, జనవరి 11:స్టాక్‌ మార్కెట్లు మరో మైలురాయికి చేరుకున్నాయి. గత నెల రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న సూచీలు సోమవారం మరో ఆల్‌టైం హైకీ చేరుకున్నాయి. కార్పొరేట్ల ఆశాజనక ఫలితాలతో ఐటీ, ఆర్థిక, వాహన రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో మదుపరులు ఎగబడి కొనుగోళ్ళు జరిపారు. ఫలితంగా 30 షేర్ల ఇండెక్స్‌ బీఎస్‌ఈ సెన్సెక్స్‌49 వేల మార్క్‌ను అధిగమించింది. 

స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో ఇంతటి గరిష్ఠ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. ఇంట్రాడేలో 49,303.79 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన సూచీ చివరకు 486.81 పాయింట్లు లేదా ఒక్క శాతం లాభపడి 49,269.32 వద్ద ముగిసింది. 49 వేల పైన ముగియడం కూడా ఇదే తొలిసారి. జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ 137.50 పాయింట్లు అందుకొని 14,484.75 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 14,498.20 స్థాయిని తాకింది. ఇది కూడా చరిత్రలో తొలిసారి. 

ఐటీ రంగ షేర్ల జోష్‌

ఐటీ రంగ షేర్లకు అనూహ్య స్పందన లభించింది. అంచనాలకుమించి ఐటీ దిగ్గజం టీసీఎస్‌ ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో ఈ రంగ షేర్లు ఎగబడి కొనుగోళ్లు జరిపారు. హెచ్‌సీఎల్‌ టెక్‌ 6.09 శాతం పెరిగి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతి, టెక్‌ మహీంద్రా, బజాజ్‌ ఆటో, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు రెండు శాతానికి పైగా లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ, టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, టైటాన్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, నెస్లె, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐటీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ఫార్మాలు లాభాల్లో ముగిశాయి. కానీ, బజాజ్‌ ఫిన్‌, రిలయన్స్‌, ఎల్‌అండ్‌టీ, కొటక్‌ బ్యాంక్‌, ఎస్బీఐ, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌ల షేర్లు మదుపరులను ఆకట్టుకోలేకపోయాయి. ఈవారం చివర్లో కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుండటం మార్కెట్లకు ఉత్సాహాన్ని ఇచ్చింది. వీటికితోపాటు కార్పొరేట్ల ఆశాజనక ఫలితాలు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీలను మరింత ముందుకు తీసుకెళ్ళాయి. రంగాలవారీగా చూస్తే ఐటీ, టెక్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, టెలికం, హెల్త్‌కేర్‌ రంగ షేర్లు మూడు శాతానికి పైగా బలపడగా...ఇంధనం, మెటల్‌, క్యాపిటల్‌ గూడ్స్‌, పవర్‌, బ్యాంకింగ్‌ సూచీలు నష్టపోయాయి. 

టీసీఎస్‌ అదరహో...

  • ఇంట్రాడేలో 12 లక్షల కోట్లుదాటిన ఎం-క్యాప్‌

దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ అదరహో అనిపించింది. కంపెనీ మార్కెట్‌ విలువ తొలిసారిగా రూ.12 లక్షల కోట్లు దాటింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించడంతో కంపెనీ షేరు అనూహ్యంగా దూసుకుపోయింది. బీఎస్‌ఈలో ఒక దశలో మూడు శాతానికి పైగా లాభపడిన షేరు ధర చివరకు 1.75 శాతం లాభంతో రూ.3,175.05 వద్ద ముగిసింది. అటు ఎన్‌ఎస్‌ఈలోనూ టీసీఎస్‌ షేర్‌ విలువ 1.59 శాతం ఎగబాకి రూ.3,170.45 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ.12,09,768 కోట్లు దాటిన కంపెనీ మార్కెట్‌ విలువ చివరకు లాభాలను నిలుపుకోలేక పోవడంతో రూ.11,91,400.91 కోట్ల వద్దకు జారుకున్నది. బీఎస్‌ఈలో 2.54 లక్షల షేర్లు చేతులు మారగా, ఎన్‌ఎస్‌ఈలో 95 లక్షల షేర్లు ట్రేడింగ్‌ జరిగింది. 

బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ 196 లక్షల కోట్లు

స్టాక్‌ మార్కెట్ల దూకుడుతో బీఎస్‌ఈలో లిైస్టెన సంస్థల విలువ కూడా వాయువేగంతో దూసుకుపోతున్నది. సోమవారం మార్కెట్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈలో లిైస్టెన సంస్థల విలువ ఆల్‌టైం హైకి చేరుకున్నది. రూ.196.56 లక్షల కోట్లుగా నమోదైంది. వరుసగా రెండోరోజు రికార్డును సృష్టించినట్లు అయింది. ట్రేడింగ్‌ సెషన్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈలో లిైస్టె సంస్థల విలువ రూ.1,96,56,811.32 కోట్లు(2.6 ట్రిలియన్‌ డాలర్లు)గా నమోదైంది. 

VIDEOS

logo