మంగళవారం 31 మార్చి 2020
Business - Jan 17, 2020 , 01:19:11

సెన్సెక్స్‌@42,000

సెన్సెక్స్‌@42,000

ముంబై, జనవరి 16: నూతన సంవత్సరంలో స్టాక్‌ మార్కెట్లు మరో మైలురాయికి చేరుకున్నాయి. గతేడాది 40 వేల మార్క్‌ దాటిన సూచీలు చివర్లో 41 వేల చారిత్రక గరిష్ఠ స్థాయిని తాకాయి. 2020 ప్రారంభంలోనే 42 వేల పాయింట్ల చారిత్రక గరిష్ఠ స్థాయిని తాకాయి. వాణిజ్య ఒప్పందంపై అమెరికా-చైనా దేశాలు సంతకాలు చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లు పరుగులు తీశాయి. ప్రారంభంలోనే భారీగా లాభపడిన దేశీయ స్టాక్‌ మార్కెట్లకు ఆర్థిక పరిస్థితులు నిరుత్సాహకరంగా ఉండటం, మరోవైపు రిటైల్‌ ద్రవ్యోల్బణం ఐదున్నరేండ్ల గరిష్ఠ స్థాయికి చేరుకోవడం తీవ్ర ఊగిసలాటలో కొనసాగిన సూచీలు చివరకు లాభాల్లోనే ముగిశాయి. ప్రారంభంలోనే 42,059.45 పాయింట్ల చారిత్రక గరిష్ఠ స్థాయిని తాకిన సూచీలు చివరకు ఈ స్థాయిలో లాభాలను నిలుపుకోలేకపోయాయి. అయినప్పటికీ 30 షేర్ల ఇండెక్స్‌ సూచీ 59.83 పాయింట్ల లాభంతో 41,932.56 వద్ద ముగిసింది. ఇది కూడా గరిష్ఠ స్థాయే. సెన్సెక్స్‌తోపాటు జాతీయ స్టాక్‌ ఎక్సేంజ్‌ సూచీ నిఫ్టీ రికార్డుల పరంపర కొనసాగింది. ఇంట్రాడేలో 12,389.05 గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టీ చివరకు 12.20 పాయింట్ల లాభంతో 12,355.50 వద్ద ముగిసింది. ఉదయం 11 గంటల వరకు లాభాల్లో కొనసాగిన సూచీలు ఒక్కసారిగా కుదుపనకు లోనయ్యాయి. మధ్యాహ్నాం వరకు ఇలాగే కొనసాగిన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన అనుకూల సంకేతాలతో చివర్లో మళ్లీ కోలుకున్నాయి.


నెస్లె ఇండియా 3.23 శాతం పెరిగి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. కొటక్‌ బ్యాంక్‌, హిందుస్థాన్‌ యునిలీవర్‌, భారతీ ఎయిర్‌టెల్‌లు ఒక్క శాతానికి పైగా మార్కెట్‌ వాటాను పెంచుకున్నాయి. పవర్‌గ్రిడ్‌, రిలయన్స్‌, టైటాన్‌, టీసీఎస్‌, బజాజ్‌ఫిన్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, సన్‌ఫార్మా షేర్లకు మదుపరుల మద్దతు లభించింది. కానీ ఎన్‌టీపీసీ 1.94 శాతం పడిపోయి టాప్‌ లూజర్‌గా నిలిచింది. హీరో, టాటా స్టీల్‌, టెక్‌ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌లు ఒక్క శాతం మార్కెట్‌ వాటాను కోల్పోయాయి. వీటితోపాటు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఐటీసీ, మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎల్‌అండ్‌టీ, ఎస్బీఐ, మారుతి, బజాజ్‌, ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌లు నష్టపోయాయి. 30 షేర్ల ఇండెక్స్‌లో 12 నష్టపోగా, 18 లాభాల్లో ముగిశాయి. రంగాలవారీగా చూస్తే రియల్టీ, కన్జ్యూమర్‌ డ్యూరబుల్‌, హెల్త్‌కేర్‌, టెలికం, ఎఫ్‌ఎంసీజీ, ఎనర్జీ, ఆటో రంగ షేర్లు ఒక్క శాతం వరకు లాభపడగా..మెటల్‌, చమురు అండ్‌ గ్యాస్‌ రంగ షేర్లు మాత్రం నష్టపోయాయి. కార్పొరేట్ల మూడో త్రైమాసిక ఫలితాలపై మదుపరులు వేచి చూసే దోరణి అవలంభిస్తున్నారని, అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం, వినియోగదారుల ధరల సూచీ, బ్యాంకుల నిరర్థక ఆస్తులు పెరుగడం సూచీల రికార్డులకు బ్రేకులు వేశాయని జియోజిట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసుల హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు. గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న ఇంధన ధరలు మళ్లీ పెరుగడం కూడా మదుపరుల్లో ఆందోళనను పెంచింది.


logo
>>>>>>