Home Loans | మనలో చాలా మంది దవాఖాన ఖర్చుల కోసమో.. ఇతర ముఖ్యమైన అవసరాల కోసమో.. బంధు మిత్రుల నుంచి అప్పులు తీసుకుంటాం.. సొంతిల్లు కట్టుకోవాలంటే బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీ)ల నుంచి రుణాలు తీసుకుంటాం.. కొందరు కొన్ని సందర్భాల్లో తెలిసిన వారు, బంధు మిత్రుల నుంచి రుణాలు తీసుకుంటారు..
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థల నుంచి తీసుకున్న రుణాలపై ఆదాయం పన్ను చట్టం ప్రకారం.. రుణాలు, వాటిపై చెల్లించే వడ్డీ మీద పన్ను రాయితీ క్లయిమ్ చేయవచ్చు. కానీ, ప్రైవేట్ వ్యక్తులు, బంధువుల వద్ద తెచ్చుకున్న రుణాలు, వాటిపై వడ్డీ చెల్లింపులపై మాత్రం పన్ను బెనిఫిట్లు పొందడం సాధ్యం కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఆదాయం పన్ను చట్టం-1961లోని 80సీ సెక్షన్ కింద ఇంటి రుణం అసలు చెల్లింపుపై పన్ను రాయితీ కోరొచ్చు.. కానీ ప్రైవేట్ రుణాలకు ఇది వర్తించదని గమనంలో పెట్టుకోవాలని అంటున్నారు నిపుణులు.
కొత్త ఇల్లు కొనుగోలు చేసినా, కొత్తిల్లు కట్టుకున్నా.. దానికోసం తీసుకున్న రుణం అసలు రూ.1.50 లక్షల చెల్లింపుపై 80సీ సెక్షన్ కింద ఏటా పన్ను రాయితీ క్లయిమ్ చేయవచ్చు. 80సీ సెక్షన్ కింద పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ (పీపీఎఫ్), ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ (ఈపీఎఫ్), ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) ల్లో పెట్టుబడులతోపాటు ఇంటి రుణం అసలు చెల్లింపు కూడా పన్ను రాయితీ నిబంధన వర్తిస్తుంది.
80సీ (2)(18) (సీ) సెక్షన్ కింద కొన్ని నిర్ధిష్ట సంస్థలు, వ్యక్తుల వద్ద తీసుకున్న రుణాల అసలు చెల్లింపునకూ పన్ను రాయితీ క్లయిమ్ చేసుకోవచ్చు.
ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ లేదా ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ వంటి నోటిఫైడ్ సంస్థల నుంచి మాత్రమే తప్పనిసరిగా రుణం తీసుకున్న వారికే పన్ను క్లయిమ్ బెనిఫిట్ ఉంటుంది. దీంతోపాటు ఒక ప్రభుత్వ రంగ కంపెనీ/ పబ్లిక్ కంపెనీ యాజమాన్యం, కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వాధీనంలోని కోఆపరేటివ్ సొసైటీ, యూనివర్సిటీ యాజమాన్యాల నుంచి తీసుకున్న రుణాల అసలు చెల్లింపునకూ 80సీ సెక్షన్ కింద పన్ను క్లయిమ్ పొందొచ్చు.
80ఈఈ సెక్షన్ కింద అదనంగా రూ.50 వేల చెల్లింపుపై పన్ను రాయితీ అందుకోవచ్చు. బంధు, మిత్రుల వద్ద తీసుకున్న రుణంపై వడ్డీ చెల్లింపు మీద 24 సెక్షన్ కింద గరిష్టంగా రూ. 2 లక్షల వరకూ పన్ను బెనిఫిట్ క్లయిమ్ చేయవచ్చు.
ఉదాహరణకు ప్రదీప్ రూ.20 లక్షల విలువైన ఇల్లు కొన్నాడనుకుందాం.. ఐదు శాతం వడ్డీపై 20 వాయిదాల్లో చెల్లించడానికి అశోక్ వద్ద రుణం తీసుకున్నాడు అనుకుందాం.. 2021-22లో అసలు రూ.లక్ష, వడ్డీ రూ.లక్ష చెల్లించేశాడు. ప్రదీప్ 24 సెక్షన్ కింద రూ.లక్ష వడ్డీ చెల్లింపునకు పన్ను క్లయిమ్ చేయొచ్చు. కానీ 80సీ సెక్షన్ కింద పన్ను బెనిఫిట్ పొందలేరు.