SBI | నూఢిల్లీ, జూన్ 15: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్లు పెంచింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో వాహన, గృహ రుణాలపై చెల్లింపులు మరింత భారంకానున్నాయి. శనివారం నుంచి అమలులోకి వచ్చిన ఈ రుణాల్లో ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు 8.65 శాతం నుంచి 8.75 శాతానికి సవరించింది. వాహన రుణాలు ఏడాది కాలపరిమితితో, వ్యక్తిగత రుణాలు రెండేండ్ల కాలపరిమితితో మంజూరు చేస్తున్నది బ్యాంక్. దీంతో బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు 8.10 శాతం నుంచి 8.95 శాతం మధ్యలో లభించనున్నాయి.
ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును బ్యాంక్ సవరించింది. గతంలో రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై వడ్డీరేటును పెంచిన ఎస్బీఐ..తాజాగా రూ.3 కోట్ల లోపు డిపాజిట్లపై వడ్డీరేటును 75 బేసిస్ పాయింట్ల వరకు సవరించింది. ఏడు రోజుల నుంచి 45 రోజుల లోపు డిపాజిట్లపై వడ్డీని 3.5 శాతం నుంచి 4 శాతానికి, 46 రోజుల నుంచి 179 రోజుల వడ్డీరేటు 5.5 శాతం నుంచి 6 శాతానికి, 180-210 రోజుల లోపు ఎఫ్డీలపై 6.75 శాతానికి, 211 రోజుల నుంచి ఏడాది లోపు ఎఫ్డీలపై వడ్డీని 6.5 శాతం నుంచి 7 శాతానికి సవరించింది. అలాగే ఏడాది నుంచి రెండేండ్ల లోపు టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటును 6.8 శాతం నుంచి 7.3 శాతానికి, 2 ఏండ్ల నుంచి మూడేండ్ల లోపు కాలపరిమితి డిపాజిట్లపై వడ్డీని 7.5 శాతానికి పెంచింది. మూడేండ్ల నుంచి ఐదేండ్ల లోపు డిపాజిట్లపై వడ్డీరేటును 6.75 శాతం నుంచి 7.25 శాతానికి సవరించిన బ్యాంక్, ఐదేండ్ల నుంచి 10 ఏండ్లలోపు డిపాజిట్లపై వడ్డీరేటును 7.50 శాతానికి పెంచింది.
ఎస్బీఐతోపాటు మరో ఐదు బ్యాంకులు ఎంసీఎల్ఆర్ రేట్లను సవరించాయి. వీటిలో హెచ్డీఎఫ్సీ, యెస్ బ్యాంక్, కెనరా, పీఎన్బీ, ఐడీబీఐ బ్యాంకులు ఉన్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ని 5 బేసిస్ పాయింట్లు సవరించింది. దీంతో రుణాలపై వడ్డీరేటు 9 శాతం నుంచి 9.35 శాతం మధ్యలోకి చేరాయి. అలాగే యెస్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు 9.25 శాతం నుంచి 10.60 శాతం మధ్యలో ఉండగా, కెనరా బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు 8.15 శాతం నుంచి 9.30 శాతంలోకి, పీఎన్బీ రేటు కూడా 8.25 శాతం నుంచి 9.10 శాతం మధ్యలో వసూలు చేస్తున్నది. అలాగే ఐడీబీఐ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు 8.35 శాతం నుంచి 10 శాతం లోపు నిర్ణయించింది.
10.40 శాతంగా నిర్ణయించింది.
మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్(ఎంసీఎల్ఆర్) కంటే తక్కువ వడ్డీరేటుకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులకు అవకాశం లేదు.