SBI Report | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై సుంకాలతో విరుచుకుపడుతున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేయాలంటూ ట్రంప్ భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి చమురు కొనుగోళ్లు ఆపేస్తే.. ప్రపంచ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు 10శాతం పెరిగే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ప్రపంచ ముడి చమురు సరఫరాలో రష్యా వాటా పది శాతం ఉంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిచిపోతే.. ఈ లోటును భర్తీ చేసేందుకు ఇతర దేశాలు ముందుకు వచ్చే వరకు అంతర్జాతీయంగా చమురు ధరలు వేగంగా పెరిగే అవకాశాలున్నాయి.
ముడి చమురు ధరలు పెరగడం వల్ల ఆయా దేశాల దిగుమతి ఖర్చులు పెరుగడంతో పాటు ఉత్పత్తి ఖర్చులు, ద్రవ్యోల్బణంపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశాలున్నాయి. దాంతో గ్లోబల్ జీడీపీ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అస్థిరత, అనిశ్చితి సమయంలో జరుగుతుండడం వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు నిలిపివేస్తే.. దేశానికి ముడి చమురు దిగుమతి బిల్లుపై అదనంగా సుమారు 12 బిలియన్ డాలర్లు భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరమైన 2025-26లో మిగిలిన కాలానికి రష్యా చమురు కొనుగోలు ఆపితే.. అదనపు ఖర్చు 9 బిలియన్ డాలర్లు కాగా.. 2026-27లో ఇది 11.7 బిలియన్ల డాలర్లకు చేరుకునే అవకాశాలున్నాయి. 2024-25లో భారతదేశం మొత్తం 24.5 కోట్ల మెట్రిక్ టన్నుల ముడి చమురు దిగుమతి చేసుకుంది. ఇందులో 8.8 కోట్ల మెట్రిక్ టన్నులు రష్యా నుంచి తీసుకున్నదే.
2019-20లో రష్యా వాటా 1.7 శాతం మాత్రమే ఉండగా.. 2024-25 నాటికి ఇది 35.1 శాతానికి పెరిగింది. 2022లో ఉక్రెయిన్ యుద్ధంపై పడిన పశ్చిమ దేశాల ఆంక్షల తర్వాత, రష్యా నుంచి భారత్ భారీ డిస్కౌంట్ ధరలకు చమురు కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. దాంతో భారతదేశానికి రష్యా అతిపెద్ద ముడి చమురును సరఫరా చేసే దేశంగా మారింది. 2030 నాటికి దేశీయ చమురు అవసరం రోజుకు 10 లక్షల బారెళ్ల వరకు పెరిగే అవకాశం ఉంది. రష్యా చమురు సరఫరా ఆటంకం ఏర్పడితే.. మధ్యప్రాచ్య దేశాల నుంచి ఉన్న ఒప్పందాల ఆధారంగా భారత్ మళ్లీ అక్కడి నుంచే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ ఒప్పందాల్లో ఉన్న సౌలభ్యాలను ఉపయోగించుకుని సరఫరా లోటును పూడ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే, భారత చమురు సరఫరా వ్యవస్థ అనుకూలంగా ఉన్నా కూడా.. రష్యా నుంచి తక్కువ ధరకే దొరికే చమురును వదులుకోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ధరల పెరుగుదల రూపంలో ప్రభావం పడే అవకాశం ఉంది.