ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ అనుబంధ సంస్థ ఎస్బీఐ కార్డ్, ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్‌పే కలిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను తీసుకొచ్చాయి. సెలెక్ట్ బ్లాక్, పర్పుల్ పేరిట రెండు వేరియంట్లలో ఇవి పరిచయమయ్యాయి. ఇవి రూపే, వీసా నెట్‌వర్క్‌లపై పనిచేస్తాయి. రూపే వెర్షన్‌ను యూపీఐకీ లింక్ చేసుకోవచ్చు. ఫోన్‌పే ఈ-గిఫ్ట్ వోచర్లుగా సెలెక్ట్ బ్లాక్‌పై రూ.1,500, పర్పుల్పై రూ.500 అందుకోవచ్చు. అంతేగాక బ్లాక్ కార్డు వినియోగదారులు ఏటా చేసే ఖర్చులు రూ.5 లక్షలుగా ఉంటే రూ.5 వేల ట్రావెల్ వోచర్, పర్పుల్ కార్డుదారులు ఏటా ఖర్చు రూ.3 లక్షలుగా ఉంటే రూ.3 వేల ట్రావెల్ వోచర్ పొందవచ్చు.
ఫోన్‌పే యాప్ ద్వారా ఈ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొనే వీలున్నది. బిల్లులనూ నేరుగా చెల్లించవచ్చు. కస్టమర్లకు ప్రతిరోజూ చేసే కిరాణా, ట్రావెల్ బుకింగ్స్, బీమా ప్రీమియంలు తదితర ఖర్చులపై రివార్డు పాయింట్లూ వస్తాయి. సెలెక్ట్ బ్లాక్ కార్డ్ ద్వారా ఫోన్‌పే యాప్‌పై కొనుగోలు లావాదేవీలు జరిపినప్పుడు 10 శాతం వరకు వాల్యూ బ్యాక్ ఆఫర్ అందుకోవచ్చు. ఆన్లైన్ షాపింగ్‌పైనా 5 శాతం వరకు ప్రయోజనాలుంటాయి.