ఫారెక్స్ మార్కెట్లో డాలర్ల డిమాండ్ ముందు వెలవెలబోతున్నది.వరుసగా 3 రోజుల్లో 124 పైసలు క్షీణించింది. ఒక్కరోజే ఇందులో సగానికిపైగా నష్టపోవడం కలవరపెడుతున్నదిప్పుడు.
ముంబై, డిసెంబర్ 6: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మరోమారు క్రమేణా బలహీనపడుతున్నది. ఫారెక్స్ మార్కెట్లో వరుసగా మూడు రోజుల్లో 124 పైసలు దిగజారడం దేశ ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతున్నదిప్పుడు. మంగళవారం ఒక్కరోజే 65 పైసలు క్షీణించగా.. 82.5 వద్ద స్థిరపడింది. నిజానికి ఒకానొక దశలో 81.94 స్థాయికి బలపడినా.. డాలర్ల డిమాండ్ ముందు నిలదొక్కుకోలేకపోయింది. ఇక అంతకుముందు రెండు రోజులు రుపీ 59 పైసలు పతనమైన విషయం తెలిసిందే.
పెట్టుబడులు రివర్స్‌గేర్
దేశం నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోతున్నాయి. భారత్‌లో విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్ఐఐ) తమ పెట్టుబడులను తగ్గించుకుంటున్నారు. ఈ పరిణామం రూపాయి ట్రేడింగ్‌ను ప్రభావితం చేస్తున్నదని ఫారెక్స్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సోమవారం ఎఫ్ఐఐలు రూ.1,139.07 కోట్ల పెట్టుబడులను దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి వెనుకకు తీసుకున్నారు. అంతకుముందు రోజుల్లో కూడా ఈ ఉపసంహరణలు కొనసాగడం గమనార్హం. మరోవైపు బ్రెంట్ క్రూడ్ ఫీచర్స్ 0.64 శాతం పెరిగి బ్యారెల్ ధర 83.22 డాలర్లకు చేరింది. ఇది కూడా రూపాయిని ఒత్తిడికి లోను చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి బుధవారం ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయం వెలువడనున్న క్రమంలో రూపాయికి వరుస నష్టాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
కోలుకోని స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల్లోనే కొట్టుమిట్టాడుతున్నాయి. మూడోరోజూ నిరాశపర్చాయి. మంగళవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 208.24 పాయింట్లు లేదా 0.33 శాతం పడిపోయి 62,626.36 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 444.53 పాయింట్లు క్షీణించడం గమనార్హం. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 58.3 పాయింట్లు లేదా 0.31 శాతం కోల్పోయి 18,642.75 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, ఎగిసిన ముడి చమురు ధరలు.. దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. కాగా, టాటా స్టీల్, రెడ్డీస్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్, మారుతి తదితర షేర్లు భారీగా నష్టపోయాయి. రంగాలవారీగా ఐటీ, బ్యాంకింగ్, రియల్టీ, టెలికం సూచీలు ప్రధానంగా పతనమయ్యాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలూ దిగజారాయి. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా, హాంకాంగ్ సూచీలు, ఐరోపా మార్కెట్లలో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి.