హైదరాబాద్, ఆగస్టు 15: ఆర్ఎస్ బ్రదర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పేర్లతో రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్న ఆర్ఎస్బీ రిటైల్ ఇండియా లిమిటెడ్..స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నది. ఇందుకు సంబంధించి మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తుచేసుకున్నది కూడా. ఈ ఐపీవో ద్వారా రూ.1,500 కోట్ల వరకు నిధులను సమీకరించాలని యోచిస్తున్నది. దీంట్లో తాజా ఈక్విటీలను జారీ చేయడంతో రూ.500 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ రూట్లో ప్రమోటర్లకు చెందిన 2.98 కోట్ల షేర్లను అమ్మకానికి పెట్టింది. ఇలా సేకరించిన నిధుల్లో రూ.275 కోట్లను రుణాల చెల్లింపుల కోసం, మరో రూ.118 కోట్లను నూతన స్టోర్లను ఏర్పాటు చేయడానికి వినియోగించనున్నది.
ప్రస్తుతం సంస్థకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో 22 నగరాల్లో 73 స్టోర్లను నిర్వహిస్తున్నది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఆర్ఎస్ బ్రదర్స్, కాంచీపురం నారాయణి సిల్క్స్, డీఏ రాయల్, వాల్యూ జోన్ హైపర్ మార్ట్ పేర్లతో అవుట్లెట్లను నిర్వహిస్తున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2,694 కోట్ల ఆదాయంపై రూ.104.4 కోట్ల నికర లాభాన్ని గడించింది. దేశీయ రిటైల్ రంగం అంచనాలకుమించి రాణిస్తున్నదని, గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.92.6 లక్షల కోట్లుగా నమోదైంది. దీంట్లో దుస్తులు, యాక్సెససీరిస్ రూ.6.90 లక్షల కోట్లుగా ఉన్నది.