House Loan | రిజర్వు బ్యాంక్ రెపోరేటును క్రమంగా పెంచుతుండటంతో ఒక్కో బ్యాంకు తమ రుణాలపై వడ్డీరేటునూ పెంచేస్తున్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులతోపాటు ప్రైవేట్ బ్యాంకు లు, ఇతర ఆర్థిక సేవల సంస్థలు సైతం తమ గృహ రుణాలపై వడ్డీని ఒక్క శాతం వరకు సవరించాయి. ఈ నెల సమీక్షలో రెపోరేటును ఆర్బీఐ పావు శాతం సవరించడంతో 6.5 శాతానికి చేరుకున్న విషయం తెలిసిందే. దీంతో గృహ రుణాలు అందించే దేశంలో అతిపెద్ద నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలైన ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, పీఎన్బీ హౌజింగ్లు కూడా తమ ఖాతాదారులపై అధిక భారం మోపాయి.
వీటిలో హెచ్డీఎఫ్సీ మాత్రం మహిళల కోసం ప్రత్యేక రుణ సదుపాయాన్ని ప్రకటించింది. రూ.30 లక్షల లోపు గృహ రుణాలు తీసుకున్న మహిళలకు 8.95 శాతం నుంచి 9.45 శాతంలోపు వడ్డీని వసూలు చేస్తున్నది. మిగతావారికి మాత్రం 9 శాతం నుంచి 9.5 శాతంలోపు వేస్తున్నది. అలాగే పీఎన్బీ హౌజింగ్ కూడా గృహ రుణాలపై 8.5 శాతం నుంచి 10.45 శాతంలోపు వడ్డీరేటును విధిస్తున్నది.