Jio Cinema | ఆస్ట్రేలియా-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ ఈ నెల 22 నుంచి 27 వరకు భారత్‌లోనే జరుగనున్నది. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో సినిమా కీలక నిర్ణయం తీసుకున్నది. మూడు వన్ డే మ్యాచ్‌ల సిరీస్ ఉచితంగా ప్రసారం చేస్తామని తెలిపింది. ఈ నెల 22న తొలి వన్డే, 24న రెండో వన్డే, 27న చివరి వన్డే మ్యాచ్ జరుగనున్నది. త్వరలో వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో ఆసీస్-భారత్ వన్డే సిరీస్‌కు ప్రాధాన్యం ఉంది.
ఆసిస్-భారత్ మధ్య జరిగే సిరీస్‌పై క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తి కనబరుస్తారు. వచ్చేనెలలో ప్రారంభం కానున్న వరల్డ్ కప్‌లో భారత్ పిచ్‌లపై టీం ఇండియాతో తలపడాలంటే ఆసిస్ ప్లేయర్లకు ఎంతో ప్రాక్టీస్ అవసరం. వన్డే మ్యాచ్‌లపై ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, భోజ్‌పురి, పంజాబీ, తమిళ్, తెలుగు, కన్నడ, మళయాళీతోపాటు 11 భాషల్లో రిలయన్స్ జియో సినిమా లైవ్ స్ట్రీమ్ ప్రసారం చేయనున్నది.
ఈ లైవ్ స్ట్రీమ్ ప్రసారాల కోసం వ్యాఖ్యాతలుగా సురేశ్ రైనా, కేదార్ జాదవ్, ఆకాశ్ చోప్రా, అమిత్ మిశ్రా, హనుమ విహారి, కిరణ్ మోరె, అనిరుద్ధ శ్రీకాంత్, సరంగ్ దీప్ సింగ్ తదితరులతో కూడిన ప్యానెల్‌ను జియో సినిమా సిద్ధం చేసుకున్నది. బీసీసీఐ నిర్వహించే ఇంటర్నేషనల్, దేశివాళీ మ్యాచ్‌ల ప్రసార హక్కులను ఐదేండ్ల పాటు రిలయన్స్ అనుబంధ సంస్థ వయాకాం 18.. వచ్చే ఐదేండ్లకు రూ.5,963 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.