Reliance | పుంజుకున్న రిటైల్ బిజినెస్.. టారిఫ్‌లు పెంచడంతో ఆదాయం పెరిగిన జియో.. ఆయిల్ అండ్ పెట్రో కెమికల్ బిజినెస్ స్థిరంగా సాగడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ డిసెంబర్ త్రైమాసికం నికర లాభాల్లో 7.4శాతం వృద్ధి నమోదు చేసింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో షేర్‌పై రూ.13.70 చొప్పున రూ.18,540 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభం గడించింది. సరిగ్గా ఏడాది క్రితం (2023-24) మూడో త్రైమాసికంలో షేర్‌పై రూ.12.76 చొప్పున రూ.12,265 కోట్ల నికర లాభం సంపాదించింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో రిలయన్స్ రూ.16,265 కోట్ల నికర లాభం పొందింది. రిలయన్స్ ఆదాయం 7.7శాతం పెరిగి రూ.2.67 లక్షల కోట్లకు పెరిగింది.
టారిఫ్‌లు పెంచడంతోపాటు కస్టమర్లు జత కలవడంతో రిలయన్స్ జియో లాభాలు పుంజుకున్నాయి. రిలయన్ జియో స్టాండలోన్ లాభం 24శాతం పెరిగి రూ.6,477కోట్లకు చేరుకుంది. ఇక డిజిటల్ బిజినెస్ ‘జియో ప్లాట్‌ఫామ్స్’ నికర లాభం 26శాతం వృద్ధితో రూ.6,861 కోట్ల వద్ద నిలిచింది. రిలయన్స్ జియో కస్టమర్లు అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 478.8 మిలియన్ల నుంచి 482.1 మిలియన్లకు పెరిగారు.
రిటైల్ స్టోర్లు పెంచడంతోపాటు కస్టమర్ల సంఖ్వ వృద్ధి చెందడంతో రిటైల్ బిజినెస్ పెరిగింది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ కొత్తగా 779 స్టోర్లు ఏర్పాటు చేసింది. డిసెంబర్ త్రైమాసికంలో పది శాతం వృద్ధి చెంది రూ.3,458 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం 282 మిలియన్ల కస్టమర్లు రిలయన్ రిటైల్ స్టోర్లను సందర్శిస్తే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో సందర్శకుల సంఖ్య 296 మిలియన్ మందికి పెరిగింది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో ప్రధాన బిజినెస్ ఆయిల్ అండ్ గ్యాస్ విభాగం నికర లాభం 4.1 శాతం తగ్గింది. రిలయన్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ రిలయన్స్ జియో, రిటైల్ విభాగాల దన్నుతో కన్సాలిడేటెడ్ నికర లాభం వృద్ధి చెందిందన్నారు.