Reliance | న్యూఢిల్లీ, జనవరి 16: దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఆశాజనక పనితీరు కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికపు నికర లాభంలో 7.4 శాతం వృద్ధి నమోదైనట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. రిటైల్ వ్యాపారంతోపాటు టెలికం విభాగం అంచనాలకుమించి రాణించడం వల్లనే లాభాల్లో ఈ మాత్రమైన వృద్ధిని సాధించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.18,540 కోట్లు లేదా ప్రతిషేరుకు రూ.13.70 చొప్పున ఆదాయాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.17,265 కోట్ల లాభం లేదా ప్రతిషేరుకు రూ.12.76తో పోలిస్తే సింగిల్ డిజిట్ వృద్ధిని నమోదు చేసుకున్నది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.2.27 లక్షల కోట్ల నుంచి రూ.2.43 లక్షల కోట్లకు ఎగబాకింది. రూ.3.5 లక్షల కోట్లకు చేరుకున్న రుణాలకోసం సంస్థ అధికంగా చెల్లింపులు జరపడం వల్లనే లాభాలు భారీగా పుంజుకోలేకపోయాయని కంపెనీ పేర్కొంది. సెప్టెంబర్ త్రైమాసికం నాటికి కంపెనీకి రుణాలు రూ.3.36 లక్షల కోట్లు, ఏడాది క్రితం ఇదే త్రైమాసికం నాటికి రూ.3.11 లక్షల కోట్లుగా ఉన్నాయి.
దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో మరోసారి భారీ లాభాలను ఆర్జించింది. గత త్రైమాసికపు లాభంలో 24 శాతం వృద్ధిని సాధించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.6,231 కోట్లుగా ఉన్న స్టాండలోన్ నికర లాభం గత త్రైమాసికానికిగాను 24.24 శాతం ఎగబాకి రూ.6,477 కోట్లకు చేరుకున్నది. కంపెనీ ఆదాయం రూ.25,368 కోట్ల నుంచి రూ.29,307 కోట్లకు ఎగబాకింది. డాటా వినిమయం ఊపందుకోవడం, సరాసరిగా డాటాపై వచ్చే ఆదాయం పెరగడం వల్లనే ఇది సాధ్యమైందని పేర్కొంది. ప్రస్తుతం సంస్థకు 48.21 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. సరాసరి ఒక్కో కస్టమర్‌పై రూ.200 ఆదాయం సమకూరింది.
గత త్రైమాసికంలో రికార్డు స్థాయి ఎబిటా మార్జిన్లు ఆర్జించినట్లు, నికర లాభంలో కన్సాలిడేటెడ్ స్థాయికి చేరుకున్నది. డిజిటల్ సర్వీసులు, టెలికం సేవలకు కస్టమర్ల నుంచి విశేష స్పందన లావడం కలిసొచ్చింది.
– ముకేశ్ అంబానీ, రిలయన్స్ సీఎండీ