Reliance-Future | ఒకవైపు సుప్రీంకోర్టుతోపాటు పలు న్యాయస్థానాల్లో వివాదంపై విచారణ కొనసాగుతున్నది.. మరోవైపు ఫ్యూచర్ రిటైల్ స్టోర్ల నిర్వహణ బాధ్యతను ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ రిటైల్ టేకోవర్ చేసింది. అంతే కాదు ఫ్యూచర్ రిటైల్‌లో పని చేస్తున్న ఉద్యోగులకు జాబ్ ఆఫర్స్ చేసింది. రిలయన్స్ అనుబంధ రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ రిటైల్ విలీనాన్ని గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యతిరేకిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఫ్యూచర్ రిటైల్ అనుబంధ బిగ్ బజార్ స్టోర్లను స్వాధీనం చేసుకుని రిలయన్స్ రిటైల్ బ్రాండ్ స్టోర్లుగా మార్చేస్తున్నదని ఓ ఆంగ్ల దినపత్రిక వార్తాకథనం ప్రచురించింది. రిలయన్స్ రిటైల్ ఉద్యోగులుగా మారిపోవాలని ఆయా బిగ్ బజార్ స్టోర్లలో పని చేస్తున్న వారికి రిలయన్స్ ఆఫర్స్ ఇస్తున్నది. దాదాపు 200 ఫ్యూచర్ రిటైల్ స్టోర్లను రిలయన్స్ రిటైల్ టేకోవర్ చేసినట్లు సమాచారం. తాజా పరిణామంపై అమెజాన్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.
వివిధ బ్యాంకుల్లో అప్పులకు తోడు కరోనా వేళ స్టోర్లు మూత పడటంతో 2020లో నష్టాల్లో చిక్కుకున్నది ఫ్యూచర్ రిటైల్. సంక్షోభం నుంచి బయటపడేందుకు రిలయన్స్ రిటైల్‌లో రూ.24,713 కోట్ల డీల్‌తో విలీనానికి 2020 ఆగస్టులో ఫ్యూచర్ రిటైల్ ఒప్పందం కుదుర్చుకున్నది. అయితే, తమకు ఫ్యూచర్ రిటైల్ అద్దెలు చెల్లించడం లేదంటూ పలువురు భూ యజమానులు రిలయన్స్‌ను ఆశ్రయించారు. దీంతో ఆయా యజమానులతో రిలయన్స్ లీజ్ ఒప్పందాలు కుదుర్చుకున్నది. వివిధప్రాంతాల్లో ఉన్న ఫ్యూచర్ రిటైల్ అనుబంధ స్టోర్లను వీలైన మేరకు రిలయన్స్ రిటైల్ లీజుకు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికార వర్గాల కథనం.
నష్టాల్లో ఉన్న స్టోర్లను రిలయన్స్ రిటైల్ పూర్తిగా స్వాధీనం చేసుకుంటుందని, మిగతా వాటిని ఫ్యూచర్ నిర్వహిస్తుందని సమాచారం. తద్వారా ఫ్యూచర్ రిటైల్ నిర్వహణ లాబాలు తగ్గించుకునే వెసులుబాటు లభిస్తుందని వినికిడి. ఇక రిలయన్స్ రిటైల్‌లో ఫ్యూచర్ విలీనాన్ని వ్యతిరేకిస్తూ సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ (ఎస్ఐఏసీ)లో 2020 అక్టోబర్‌లో మధ్యవర్తిత్వ పిటిషన్ దాఖలు చేసింది అమెజాన్. ప్రస్తుతం సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, ఎన్సీఎల్టీల్లో ఈ కేసు విచారణ పెండింగ్‌లో ఉన్నది. మరోవైపు, తమ సంస్థలో ఫ్యూచర్ రిటైల్ విలీనం గడువును రిలయన్స్ రిటైల్ వచ్చేనెలాఖరు వరకు పొడిగించింది. ఇలా రిలయన్స్ గడువు పొడిగించడం ఇది రెండోసారి.