Jio 4G Smart Phone | టెలికం సంచలనం రిలయన్స్ జియో ఏం చేసినా సంచలనమే.. 2003లో ఫీచర్ ఫోన్ అందుబాటులోకి తెచ్చినా.. 2016లో 4జీ ఫోన్లతో టెలికం మార్కెట్ని షేక్ చేసినా.. అది జియోకే సొంతం.. తర్వాత రూ.2000లకే ఫీచర్ ఫోన్ తీసుకొచ్చింది. తాజాగా 4జీ ఎంట్రీ లెవల్ ఫోన్ కేవలం రూ.999లకే అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికీ ఫీచర్ ఫోన్లు వాడుతున్న యూజర్లను లక్ష్యంగా చేసుకుని జియో ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ ‘జియో భారత్ 4జీ’ సోమవారం మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ సేల్స్ శుక్రవారం (జూలై 7) నుంచి ప్రారంభం అవుతాయి. దేశంలోని 6500 తహసీళ్ల పరిధిలో తొలి పది లక్షల మంది యూజర్లతో బీటా ట్రయల్స్ నిర్వహిస్తామని తెలిపింది.
ఈ ఫోన్ మీద రూ.123 టారిఫ్ ప్లాన్ కూడా ప్రవేశ పెట్టింది. 28 రోజుల వాలిడిటీ గల ఈ ప్లాన్ ద్వారా 14 జీబీ డేటా లభిస్తుంది. దీని ప్రకారం 0.5 జీబీ డేటా పొందొచ్చు. ఇతర టెలికం ఆపరేటర్లతో పోలిస్తే ఏడు రెట్లు ఎక్కువ డేటా అందిస్తున్నది. నెలవారీ ప్లాన్ 30 శాతం చౌక. దీంతో పాటు అపరిమిత కాల్స్ చేయొచ్చు. అంతే జియో సినిమా, జియో సావన్, ఎఫ్ఎం రేడియో వంటి ఎంటర్టైన్మెంట్ యాప్స్ కోసం దీన్ని వాడుకోవచ్చు. యూపీఐ పేమెంట్స్ కూడా చేయొచ్చు.
ఈ సందర్భంగా రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ ‘ఇంకా భారత్లో 25 కోట్ల మంది యూజర్లు 2జీ తరం సేవల్లోనే ఉన్నారు. టెలికం రంగంలో ప్రపంచవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులో ఉండగా 2జీ ఫోన్లతో ఇంటర్నెట్ సేవలకు దూరంగా ఉన్నారు. ఆరేండ్ల క్రితం జియో సేవలు ప్రారంభించిన తర్వాత ఇంటర్నెట్ సేవలు, టెక్నాలజీ బెనిఫిట్లను ప్రతి సామాన్య భారతీయుడికి అందుబాటులోకి తెచ్చాం. ఇక టెక్నాలజీ ఎంత మాత్రమూ ఏ కొద్ది మంది సొత్తు కాదు’ అని వ్యాఖ్యానించారు.