Mukesh Ambani | ఈ-కామర్స్ రంగంలో పూర్తిగా పట్టు సాధించే దిశగా ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అడుగులేస్తున్నది. అందులో భాగంగా ఇంటర్నేషనల్ డ్రగ్ స్టోర్ యూనిట్ వాల్‌గ్రీన్స్ బూట్స్ అలయెన్స్ ఇంక్ అనుబంధ బూట్స్ చైన్ కొనుగోలు బిడ్ దాఖలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నది. బూట్స్ చైన్ కొనుగోలుకు రెండు సంస్థల మధ్య చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని ఈ అంశంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.
భారత్‌లోని కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తమ సంప్రదాయ రిఫైనింగ్ వ్యాపారం నుంచి దేశంలోని 130 కోట్ల మంది పౌరులను తన గొడుగు కిందకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. యూరప్‌లోని టెలికం రంగం సహా పలు రంగాల సంస్థల కొనుగోలుకు గల అవకాశాలను ముకేశ్ అంబానీ ప్రయత్నిస్తున్నారు.
బూట్స్ చైన్ విలువ 901 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. అయితే బూట్స్ కొనుగోలు దిశగా రిలయన్స్ అడుగులేస్తుందని తప్పనిసరిగా చెప్పలేమని ఆ వర్గాలు తెలిపాయి. వాల్‌గ్రీన్స్ దీనిపై స్పందించడానికి నిరాకరించింది. రిలయన్స్ అధికార ప్రతినిధి కూడా స్పందించేందుకు అందుబాటులోకి రాలేదు. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో బూట్స్ చైన్ విక్రయానికి వాల్‌గ్రీన్స్ చర్యలు చేపట్టింది. అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ ఇంక్, టీడీఆర్ క్యాపిటల్ సంస్థలు ఆసక్తి చూపినట్లు సమాచారం.
బ్రిటన్‌లో బూట్స్ చైన్ దాదాపు 2,200 స్టోర్లు నిర్వహిస్తున్నది. త్వరలో మైనారిటీ వాటా విక్రయానికి వాల్ గ్రీన్స్ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐర్లాండ్, నార్వే, నెదర్లాండ్స్, థాయిలాండ్ తదితర దేశాల్లోనూ బూట్స్ సేవలందిస్తున్నది.