న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: యాపిల్, నైక్ తదితర గ్లోబల్ దిగ్గజ బ్రాండ్లను వెనక్కునెట్టి భారతీయ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అత్యుత్తమ బ్రాండ్ల జాబితాలో దూసుకుపోయింది. తాజాగా విడుదలైన ఫ్యూచర్‌బ్రాండ్ ఇండెక్స్ 2024 లిస్టులో సామ్సంగ్ తర్వాత బెస్ట్ బ్రాండ్‌గా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతే యాపిల్, నైక్, వాల్ట్ డిస్నీ, నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, టొయోటా వంటి ప్రముఖ సంస్థలుండటం గమనార్హం. కాగా, 2023తో పోల్చితే 2024లో సామ్సంగ్ 5వ స్థానం నుంచి నెంబర్ 1కు చేరింది. ఇక రిలయన్స్ 13 నుంచి 2కు వచ్చింది. అయితే యాపిల్ 1 నుంచి 3కు దిగజారింది. 2014లో అగ్రస్థానంలో ఉన్న గూగుల్.. 2024లో 57కు పడిపోయింది. మెటా కూడా 11 నుంచి 52కు దిగొచ్చింది. బోయింగ్, ఫోక్స్‌వాగన్ సంస్థలకైతే తాజా ర్యాంకింగ్స్‌లో చోటే లేకుండా పోయింది. ఇదిలావుంటే ఈసారి జాబితాలో రిలయన్స్ మినహా మరే ఇతర భారతీయ సంస్థలు లేవు. ‘గడిచిన దశాబ్దానికిపైగా ఫ్యూచర్‌బ్రాండ్ ఇండెక్స్.. విజయవంతమైన బ్రాండ్లు మనుగడ సాగించడంపైనేగాక, నిలకడైన వృద్ధిని ఎలా నిలబెట్టుకుంటున్నాయో తెలియపరుస్తున్నది’ అని నిర్వహకులు ఈ సందర్భంగా అన్నారు. కాగా, ఫ్యూచర్‌బ్రాండ్ ఇండెక్స్.. ఓ వార్షిక అధ్యయనం. మార్కెట్ క్యాపిటలైజేషన్, మరికొన్ని అంశాల ద్వారా టాప్-100 కంపెనీలతో ఓ జాబితాను సిద్ధం చేస్తుంది.