RBI | బెంగళూరు, ఆగస్టు 26: దేశ ఆర్థిక వ్యవస్థలో డిజిటలైజేషన్ విజయం తెచ్చిన ఉత్సాహంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరో సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టబోతున్నది. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ (యూఎల్ఐ)ను అందుబాటులోకి తీసుకురానున్నది. ఇదో సులభతర రుణ సదుపాయ వేదిక. చిన్న, గ్రామీణ రుణగ్రహీతలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని దీన్ని ఆర్బీఐ తెస్తున్నది. నిజానికి గత ఏడాదే ఈ నయా టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను రెండు రాష్ర్టాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా పరిచయం చేయాలని చూస్తున్నారు. ‘మేము ప్రారంభించాలనుకుంటున్న కొత్త వేదికను ఇప్పట్నుంచి యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్గా పిలుస్తాం.
దీనిద్వారా బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)ల వంటి రుణదాతలకు విభిన్న డాటా సర్వీస్ ప్రొవైడర్ల నుంచి రుణగ్రహీతల సమ్మతితో వారికి సంబందించిన అన్ని సాంకేతిక సమాచార వివరాలు అందుతాయి. ఆయా రాష్ర్టాల్లో ఉన్న భూ రికార్డుల వివరాలనూ అప్పులిచ్చేవారు తెలుసుకోవచ్చు’ అని సోమవారం ఇక్కడ ‘డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్’ అంశంపై జరిగిన ఆర్బీఐ@90 గ్లోబల్ కాన్ఫరెన్స్‌కు హాజరైన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఈ క్రమంలోనే భారతీయ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రయాణంలో జన్‌ధన్-ఆధార్-మొబైల్ (జేఏఎం), యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ), యూఎల్ఐలను ఓ విప్లవాత్మక ముందడుగుగా దాస్ అభివర్ణించారు.
దేశ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడానికి విధానాలు, వ్యవస్థల్ని రూపొందించేందుకు.. నూతన వేదికల ఆవిష్కరణకు ఆర్బీఐ నిరంతరం పనిచేస్తూనే ఉంటుందని దాస్ స్పష్టం చేశారు. ఇక భారత్‌తో ఆయా దేశాల సమన్వయం, సర్దుబాట్లతో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) చెల్లుబాటు విస్తృతం కాగలదన్నారు. అలాగే గడిచిన దశాబ్ద కాలంలో దేశీయ బ్యాంకింగ్ రంగంలో ఎన్నో సాంకేతిక మార్పులు వచ్చాయని గుర్తుచేశారు. డిజిటలైజేషన్‌తో బ్యాంకింగ్ లావాదేవీలు చాలా సులభమైపోయాయని చెప్పారు. రుణాల మంజూరు ప్రక్రియ కూడా సరళతరమైందన్నారు. అయితే వ్యక్తిగత సమాచార గోప్యతపట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని గవర్నర్ దాస్ అన్నారు.
రుణ మదింపు, ముఖ్యంగా చిన్న, గ్రామీణ రుణగ్రహీతలు రుణాలు పొందేటప్పుడు పట్టే సమయాన్ని యూఎల్ఐ బాగా తగ్గిస్తుందని ఈ సందర్భంగా దాస్ తెలియజేశారు. యూఎల్ఐ నిర్మాణం సాధారణ, ప్రామాణిక ఏపీఐలను పోలి ఉంటుందన్నారు. కాబట్టి డాక్యుమెంట్లు కూడా పెద్దగా అవసరం ఉండదని పేర్కొన్నారు. అంతేగాక వ్యవసాయ రుణగ్రహీతలతోపాటు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)ల రుణగ్రహీతలకూ లాభిస్తుందన్న ఆశాభావాన్ని దాస్ వ్యక్తం చేశారు. ‘పైలట్ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన ఫలితం ఆధారంగా యూఎల్ఐ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నాం.
యూపీఐ మాదిరే యూఎల్ఐ కూడా ఆదరణ పొందుతుందన్న నమ్మకం ఉన్నది’ అని దాస్ తెలిపారు. ఇదిలావుంటే 2016 ఏప్రిల్‌లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ద్వారా యూపీఐ సేవలను దేశానికి పరిచయం చేశామన్న దాస్.. భారత్‌లో రిటైల్ డిజిటల్ పేమెంట్స్ వృద్ధిలో ఇది కీలకపాత్ర పోషించిందని చెప్పారు. కాగా, ఆర్బీఐ మార్గదర్శకంలో బ్యాంకులు ప్రమోట్ చేసినదే ఈ ఎన్పీసీఐ అన్న విషయం తెలిసిందే. బ్యాంకులు, నాన్-బ్యాంక్ థర్డ్ పార్టీ యాప్‌లు, క్యూఆర్ కోడ్ల వినియోగం.. ఇలా అన్నీ కలిసి యూపీఐకి ప్రజాదరణను తీసుకొచ్చాయి. భారత్‌లోనేగాక, ఆయా దేశాల్లోనూ యూపీఐ ప్రఖ్యాతిగాంచినట్టు దాస్ అన్నారు.