న్యూఢిల్లీ, నవంబర్ 20: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఏ స్థాయిలో ఉండాలన్నదానిపై ఏ లక్ష్యం పెట్టుకోలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. అలాగే ఫారెక్స్ మార్కెట్లో ఇటీవలికాలంలో రూపీ క్షీణతకు కారణం అమెరికా కరెన్సీకున్న డిమాండేనన్నారు. అమెరికాలోకి దిగుమతయ్యే భారతీయ వస్తూత్పత్తులపై ట్రంప్ సర్కారు విధించిన 50 శాతం సుంకాల నేపథ్యంలో తలెత్తిన వాణిజ్య అనిశ్చిత పరిస్థితులతోనే ఇదంతా అని వివరించారు. గురువారం ఇక్కడ ప్రతిష్ఠాత్మక ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో వీకేఆర్‌వీ రావు స్మారకోపన్యాసాన్ని మల్హోత్రా చేశారు. ఈ సందర్భంగా భారత్‌లో విదేశీ మారకపు నిల్వలు సరిపడా ఉన్నాయని చెప్పారు. కాబట్టి అంతర్జాతీయ పరిణామాలపై ఆందోళన అక్కర్లేదన్నారు. అయినా రూపీ అనేది ఓ ఆర్థిక సాధనమని, డాలర్లకు డిమాండ్ ఉన్నప్పుడు రూపీ విలువ తగ్గడం, రూపాయికి డిమాండ్ పెరిగితే డాలర్ విలువ పడిపోవడం సాధరణమేనని వ్యాఖ్యానించారు.
ఇక వ్యవస్థలో ఆర్థిక సుస్థిరతకే ఆర్బీఐ అత్యంత ప్రాధాన్యతనిస్తుందని స్పష్టం చేశారు. కాగా, ఓ ప్రశ్నకు బదులిస్తూ.. అమెరికాతో భారత్ త్వరలోనే ఓ చక్కని వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోగలదన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. దానివల్ల దేశ కరెంట్ ఖాతా లోటుపై పడుతున్న భారం కూడా తగ్గగలదన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు. ఎగుమతులు, విదేశీ సంస్థాగత పెట్టుబడులు (ఎఫ్ఐఐలు) కరెంట్ ఖాతా లోటు, మూలధన లభ్యతల్ని ప్రభావితం చేస్తున్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ అమెరికాతో ట్రేడ్ డీల్ ఈ సమస్యలన్నింటికి పరిష్కారం కాగలదని మల్హోత్రా గట్టి నమ్మకాన్ని ప్రదర్శించారు.
అంతర్జాతీయంగా ఉన్న టాప్-100 బ్యాంకుల జాబితాలో భారత్ నుంచి త్వరలోనే మరిన్ని చేరగలవని ఆర్బీఐ చీప్ మల్హోత్రా ధీమా కనబర్చారు. వీకేఆర్‌వీ రావు స్మారకోపన్యాసం అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశంలోని అనేక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు వేగంగా వృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే త్వరలోనే టాప్-100 గ్లోబల్ బ్యాంక్స్‌లో భారత్‌కు చెందిన బ్యాంకుల పేర్లు మరిన్ని ఉంటాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ (43వ స్థానం), ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ (73వ స్థానం) మాత్రమే టాప్-100లో ఉన్నాయి. అయితే ఈ ఏడాది మార్చి ఆఖరుతో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2024-25) ప్రభుత్వ బ్యాంకులన్నింటి లాభం రికార్డు స్థాయిలో రూ.1.78 లక్షల కోట్లుగా నమోదైంది.
అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2023-24)తో పోల్చితే ఇది 26 శాతం ఎక్కువ. మొత్తం 12 ప్రభుత్వ బ్యాంకుల లాభం నాడు రూ.1.41 లక్షల కోట్లుగా ఉన్నది. కాగా, దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల విలీనాలతో ప్రపంచ స్థాయి బ్యాంకులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే. ఇప్పటికే మోదీ సర్కారు హయాంలో 27 ప్రభుత్వ బ్యాంకులు 12కు పడిపోయాయి. ఈ నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు బ్యాంక్ ఉద్యోగుల ఆగ్రహానికి దారితీశాయి. ఈ క్రమంలో ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా త్వరలో మరిన్ని ప్రపంచ శ్రేణి బ్యాంకులు భారత్ నుంచి రాబోతున్నాయని చెప్పడం.. ప్రభుత్వ బ్యాంకుల్లో విలీనాలు అనివార్యమేనన్న సంకేతాలనిస్తున్నది.
డిజిటల్ మోసాలను అరికట్టడానికి తెచ్చిన మ్యూల్ హంటర్ టూల్ పనితీరు ఎంతో సంతృప్తికరంగా ఉందని ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా తెలిపారు. మ్యూల్‌హంటర్.ఏఐ పేరిట ఓ కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత సాధనాన్ని రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ మ్యూల్ ఖాతాల కోసం రూపొందించిన సంగతి విదితమే. ఇది ప్రతి నెలా దాదాపు 20వేల మ్యూల్ ఖాతాలను గుర్తిస్తున్నది. అక్రమార్జనల్ని దాచుకోవడానికి నేరగాళ్లు వాడే బ్యాంక్ ఖాతాలనే మ్యూల్ అకౌంట్స్ అంటారు. ఈ ఖాతాలను వాడుతూ డిజిటల్ మోసాలకు పాల్పడేవారికి చెక్ పెట్టేందుకు గత ఏడాది ఆర్బీఐ.. ఏఐ, మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) ఆధారంగా మ్యూల్ హంటర్ మాడల్‌ను ఆవిష్కరించింది. కాగా, ఆర్బీఐ గవర్నర్ కావడానికి ఏం చేయాలో కొన్ని టిప్స్ చెప్పండి? అంటూ ఈ సందర్భంగా ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు మల్హోత్రా ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. ‘xఇష్టంతో పనిచేయండి.. ఫలితాన్ని చూడకండి. కర్మానుసారం వెళ్లండి. ఏం జరిగినా వెనుదిరిగి చూడకుండా ముందుకే కదలండి అంతా మంచే జరుగుతుంది’ అన్నారు.