2000 Notes | రద్దు చేసిన రూ.2000నోట్లు మంగళవారం నాటికి 98.21 శాతం తిరిగి బ్యాంకులకు చేరాయని.. ఇంకా రూ.6,366 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఇండియా స్పష్టం చేసింది. 2023 మే 19న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2వేల నోట్ల చెలామణిలో నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన రోజు వరకు రూ.2వేల నోట్ల మొత్తం విలువ రూ.3.56లక్షల కోట్లుగా రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది.
మార్చి 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరం తర్వాత రూ.6,366 కోట్లు ఇంకా మార్కెట్లోనే ఉన్నాయని.. ఇప్పటి వరకు నోట్లలో 98.21 శాతం తిరిగి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. రద్దు చేసిన నోట్లను 2023 అక్టోబర్ 7 వరకు అన్ని బ్యాంకుల్లో రూ.2వేల నోట్లను డిపాజిట్ చేయడం లేదంటే మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. ఆ తర్వాత ఆర్బీఐ రూ.2వేల నోట్లను సేకరిస్తున్నది. సామాన్య ప్రజలు దేశంలోని ఏ పోస్టాఫీసు నుంచైనా, ఇండియన్ పోస్ట్ ద్వారా భారతీయ రిజర్వ్ బ్యాంక్ కార్యాలయాల్లోనూ రూ.2000 నోట్లను పంపి తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకునే అవకాశం ఇస్తున్నది. రూ. 2000 బ్యాంకు నోట్లు చట్టబద్ధమేనని ఆర్బీఐ పేర్కొంది.