న్యూఢిల్లీ, డిసెంబర్ 16: పేమెంట్ ప్రాసెసింగ్ బిజినెస్ కోసం కొత్త కస్టమర్లను తీసుకోవద్దని, తాత్కాలికంగా ఆపేయాలని రేజర్‌పే, క్యాష్ఫ్రీలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశించింది. నిజానికి కొద్దిరోజుల కిందటే ఈ ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. మరోవైపు ఇది తాత్కాలిక చర్యేనని, దీనివల్ల తమ ప్రస్తుత వ్యాపార కార్యకలాపాలపై, వ్యాపారులపై ఎటువంటి దుష్ప్రభావం ఉండబోదని రేజర్‌పే తెలియజేసింది. క్యాష్‌ఫ్రీ నుంచి మాత్రం ఎటువంటి సమాధానం లేదు.
కాగా, లావాదేవీలు, లైసెన్స్‌కు సంబంధించి ఈ ఏడాది జూలైలో ఆర్బీఐ నుంచి రేజర్‌పేకు సూత్రప్రాయ ఆమోదం లభించింది. ఈ క్రమంలోనే తుది లైసెన్స్ మంజూరు ప్రక్రియ జరుగుతున్నదని, అయితే కొంత అదనపు సమాచారం ఆర్బీఐకి సమర్పించాల్సి ఉన్నదని రేజర్‌పే అంటున్నది. ఇందులో భాగంగానే సదరు సమాచారం అందేదాకా కొత్తగా ఆన్లైన్ వ్యాపారులను తీసుకోవడం ఆపేయాలని ఆర్బీఐ కోరినట్టు చెప్తున్నది. ఓ బాధ్యతగల కార్పొరేట్‌గా ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరిస్తామని రేజర్‌పే అధికార ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. అయితే రేజర్‌పేఎక్స్, కార్పొరేట్ కార్డ్, ఈజీట్యాప్ ద్వారా ఆఫ్‌లైన్ చెల్లింపుల సేవలు యథాతథంగా సాగుతాయని, కొత్త వ్యాపారులకూ అవకాశం ఉంటుందని తెలిపారు.