హైదరాబాద్, మే 10: హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మల్టీస్పెషాలిటీ పెడియాట్రిక్, గైనకాలజీ హాస్పిటల్ చైన్ రెయిన్బో చిల్డ్రన్ మెడికేర్ షేర్లు లిస్టింగ్ రోజే నీరసించాయి. ఈ సంస్థ జారీచేసిన పబ్లిక్ ఆఫర్ ధర రూ. 542తో పోలిస్తే మంగళవారం బీఎస్ఈలో 6.6 శాతం తక్కువగా రూ. 506 వద్ద లిస్టయ్యింది. ఆ స్థాయి నుంచి రూ.517 స్థాయికి పెరిగినప్పటికీ, తదుపరి అమ్మకాలు వెల్లువెత్తడంతో ఒక దశలో 25 శాతం పతనమై రూ.521 కనిష్ఠాన్ని తాకింది. చివరకు 16.96 శాతం నష్టంతో రూ. 450 వద్ద ముగిసింది. ఈ ఐపీవో సంస్థాగత ఇన్వెస్టర్ల మద్దతుతో 12.43 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్ అయినప్పటికీ, రిటైల్ ఇన్వెస్టర్లు, హైనెట్వర్త్ ఇన్వెస్టర్ల స్పందన కరువయ్యింది. దీంతో రెయిన్బో లిస్టింగ్ నిస్తేజంగా ఉంటుందన్న అంచనాలు మార్కెట్లో ముందుగానే నెలకొన్నాయి. ఏప్రిల్ 27-29 మధ్య తీసుకొచ్చిన ఐపీవో ద్వారా సంస్థ రూ. 1,581 కోట్ల నిధుల్ని సమీకరించింది. ఇందులో రూ. 1,300 కోట్లు ప్రస్తుత షేర్హోల్డర్లు వారి వాటాల్ని ఆఫర్లో విక్రయించడం ద్వారా సమకూర్చుకున్నారు. రూ. 280 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను కంపెనీ జారీచేసింది.